ఢిల్లీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు

share on facebook

– ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ,, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గానూ ఆరు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్‌ఆద్మీ పార్టీతో పొత్తు విషయమై ఇంతకాలం వేచిచూసిన ఆ పార్టీ చివరకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. సీనియర్‌ నేత, దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనుండగా.. మరో కీలక నేత అజయ్‌ మాకెన్‌ న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. తొలుత ఢిల్లీ తూర్పు స్థానం నుంచి షీలా దీక్షిత్‌ బరిలోకి దిగుతారని భావించినా.. అక్కడి నుంచి అర్విందర్‌ సింగ్‌ను పోటీలో నిలిపారు. అలాగే చాంద్‌నీ చౌక్‌ నుంచి జేపీ అగర్వాల్‌, నార్త్‌ వెస్ట్‌ నుంచి రాజేశ్‌ లిలోతియా, దిల్లీ పశ్చిమం నుంచి మహాబల్‌ మిశ్రా పోటీ చేస్తున్నారు. మరో స్థానం దిల్లీ దక్షిణం అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆప్‌తో పొత్తుపై ఇంతకాలం మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు విషయంలో పొసగకపోవడంతో ఇక చర్చల పక్రియకు స్వస్తి పలికింది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని షీలా దీక్షిత్‌ లాంటి సీనియర్‌ నేతలు పొత్తును వ్యతిరేకించారు. మరోవైపు అజయ్‌ మాకెన్‌ నేతృత్వంలో ఓ వర్గం భాజపాను ఓడించాలంటే ఆప్‌తో జట్టుకట్టాల్సిందేనని వాదించారు. ఈ విషయంపై నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కాగా ఎట్టకేలకు షీలా దీక్షిత్‌ మాట ప్రకారం కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఇదిలాఉంటే ఢిల్లీలోని ఏడు స్థానాలకుగానూ మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Other News

Comments are closed.