తరుగు పేరుతో తప్పని రైతు దోపిడీ

share on facebook

వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు

నల్లగొండ,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఏటా సీజన్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా మార్పు రావడంలేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏటా రెండు సీజన్‌లలో రైతులు సుమారు కోట్ల మేర దోపిడీకి గురువుతున్నారు. తరుగుపేరుతో రైతులను దోచేస్తున్నారు. ఇలా ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.750 నుంచి రూ.850 వరకు నష్టపోతున్నాడు. ప్రధాన పట్టణాలలో మిల్లులు ఉన్న చోట తరుగు విధానం లేదు. కేవలం కిలో తరుగుతోనే కాంటాలు జరుగుతున్నాయి. లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి కిలో తరుగుతోనే కాంటాలు వేసుకోవాలని సూచించినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతకు న్యాయం జరగడంలేదు. ల్గ/తులు పండించిన పంటను బస్తాలలో బస్తాకు 70 కిలోలు వంతున తూకం వేస్తారు. సంచితో కాంటా వేస్తే.. బస్తా బరువు కింద అదనంగా కిలో అంటే 71 కిలోలు తూకం వేయాలి. వ్యాపారులు అదనంగా రెండు కిలోలు అంటే 72 కిలోలు వేసుకుంటున్నారు. గతంలో కళ్లాలు చేసేటపుడు పట్టలు లేక నేలపై నూర్పిడి చేసేవారు. అపుడు కళ్లాలలో మట్టి, ఎగపోత సమయంలో గాలికి వెళ్లని చెత్త ఎక్కువగా ఉంటుందని కిలో అదనంగా తూకం వేసుకునే వారు. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. వరికోత యంత్రాలతో పనులు చేస్తున్నందున మట్టి, చెత్తా లేకుండా శుభ్రంగా వస్తున్నాయి. తరుగు తీయాల్సిన అవసరం లేదు. వ్యాపారులు పాత పద్ధతిలోనే తరుగు తీసుకుంటున్నారు. కిలో తరుగు వల్ల ఎకరానికి బస్తా తేడా వస్తుంది. ఎరువు కట్ట ఖరీదు నష్టపోతున్నామని అన్నారు. ఇక్కడి వ్యాపారులు రెండు కిలోలు తూకం అదనంగా వేసుకుని మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలలో కిలో తరుగుతోనే అమ్ముతున్నారు. పట్టుపడినా కేసులు లేకుండా పైరవీలు చేసుకుని వ్యాపార దందా సాగిస్తున్నారు. ఈ దోపిడీ అరికట్టాలని మార్కెటింగ్‌ అధికారులు అంటున్నా అమలు కావడం లేదు.

Other News

Comments are closed.