తిరుమల శ్రీవారికి అపచారం చేస్తున్నదెవరు?

share on facebook

తిరుమలలో ఏం జరుగుతోంది..? ఎందుకు వివాదాలు చెలరేగుతున్నాయి… అన్యమత ప్రభావం ఉన్నవారు ఎందుకు ఛైర్మన్లు అవుతున్నారు. అదొక ప్రత్యేక సామ్రాజ్యంగా ఎందుకు ఉంటోంది. తిరుమల పవిత్రతకు ఎందుకు భంగం వాటిల్లుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు ఏమవుతున్నాయి. విరాళాలకు లెక్కలేవీ? ఇలా అనేక సమస్యలపై  అనుమానాలు బలపడుతున్న వేళ ప్రధాన అర్చకులు  రమణ దీక్షితులు వెలిబుచ్చిన అభిప్రాయాలు,అనుమానాలు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే వీటికి సమాధానం ఇచ్చుకోవాల్సిన ధర్మకర్తల మండలి అధర్మ నిర్ణయాలు తీసుకుంది. అర్చకులకు వయస్సు నిర్ణయిస్తూ రమణదీక్షితులు తదితరులను తొలగిస్తూ తొలి సమావేశం తీసుకున్న నిర్ణయం అనుమానాలను మరింత బలం చూకూర్చేలా ఉంది. తొలిసమావేవంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవమా లేక..అనుమానాలను నివృత్తి చేసేలా ఎందుకు చర్చ చేయలేదన్నది ప్రశ్న. నిజానికి రమణదీక్షితులు  వెలిబుచ్చిన అభిప్రాయాల్లో ప్రధానంగా ..ధర్మానికి ,శాస్త్రాలకు విరుద్ధంగా బోర్డు  అధికారులు వ్యవహరిస్తున్నారు. స్వామి వారి నిత్య పూజలకు ,సేవలకు కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారు. స్వామి వారికి సమయానికి కాసింత నైవేద్యం కూడా పెట్టనీయడం లేకుండా ప్రముఖుల సేవలో అధికారులు తరిస్తున్నారు. సాంప్రదాయక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తమ సొంత జాగీరుగా మార్చుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దేవాలయ నిర్వహణపై కనీస అవగాహన లేని బోర్డు  అధికారుల కారణంగా భక్తుల విశ్వాసాలు గాయపడుతున్నాయి.సామాన్య భక్తులపై అమర్యాదగా ప్రవర్తిస్తూ స్వామి వారి దర్శనాన్ని కూడా సరిగ్గా చేసుకోనీయడం లేదు. తిరుమల కట్టడాలను, స్వామి వారి ఆభరణాలను, పురాణాలను,  శాస్త్రాలను, వ్యవస్థలను సంరక్షించుకోవడానికి భక్తులు ఉద్యమించాలి. తిరుమల దేవస్థానంలో సిసి కెమరాలు పనిచేయకుండా చేసి అనేక శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలకు ,అక్రమాలకు పాల్పడుతున్నారు. పెద్దఎత్తున అవినీతి రాజ్యమేలుతుంది ,తిరుమలలో వెలుగుచూస్తున్న వ్యవహారాలపై దర్యాప్తు జరిపించాలి. తిరుమల పవిత్రతను కాపాడాలని నిలదీస్తే మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మాపై కక్ష కట్టి ప్రధాన అర్చక వ్యవస్థను, సన్నిధి గొల్ల వ్యవస్థను తీసేయడానికి కుట్రలు చేస్తున్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయని అందుకే దశాబ్దాల మౌనాన్ని వీడి భక్తులతో కలిసి తిరుమల పవిత్రత కాపాడటానికి ఉద్యమించాలని స్వామి వారి ఆదేశంమేరకే  మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. తిరుమల తిరుపతి పవిత్రత కాపాడటానికై భక్త కోటి ముందుకు కదలాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. అయితే ఆయన అనుమానాల్లో లేదా లేవనెత్తిన ఒక్క అంశంపైనా తిరుమల ధర్మకర్తల మండలి చర్చించలేదు. ఛైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్‌ నియామకంలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన నియామకం జరిగింది. తిరుమల పవిత్రతను పెంచి ఆచార,వ్యవహారాలు తెలిసిన పెద్దమనుషులను బోర్డులో నియమించలేదు. నీతులు చెప్పే చంద్రబాబు తిరుమలను రాజకీయ ఉపాధికేంద్రంగా మార్చుకోవడం దారుణం కాక మరోటి కాదు. అందుకే నిర్ణయాలు రాజకీయ కోణంలోనే ఉన్నాయి.  అనుమానాలు వ్యక్తం చేసి, ప్రశ్నలు లేవనెత్తిన తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల్ని టీటీడీ పాలక మండలి పరోక్ష రీతిలో సాగనంపింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రధాన అర్చకులకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఇకపై టీటీడీ ఆలయాల్లో 65ఏళ్లు దాటిన అర్చకులు పదవీ విరమణ చేయాలని తీర్మానించింది. ఇటీవలే ఏర్పడిన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి బుధవారం తిరుమలలో తొలిసారి సమావేశమై తీసుకున్న ఘన నిర్ణయం ఇదే కావడం 
రాజకీయం కాక మరోటి కాదు.  టీటీడీలో 65ఏళ్లు పైబడిన అర్చకులు పదవీ విరమణ చేయాలని తీర్మానిం చామని, అర్హత మేరకు వారి కుటుంబ సభ్యులతో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే  ఆగమ నియమాలకు విరుద్దంగా నిర్ణయాలు సాగుతున్న తీరు విచారకరం. అర్చన అన్నది వయసుతో సంబంధం లేనిది. అర్చకులకు వయసు అన్నది ఎక్కడా ఉండదు. ధర్మకర్తల మండలి అనూహ్యంగా తీసుకున్న  నిర్ణయం మేరకు టీటీడీలోని అర్చకులు 52మందిలో 15మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.11వేల కోట్లు టీటీడీ డిపాజిట్లు ఉన్నాయని వీటిలో గత మార్చిలో రూ.4వేల కోట్లు రెన్యువల్‌ చేశామన్నారు. ఈ డిపాజిట్ల వ్యవహారంపై ఓ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై బోర్డులో చర్చించామని, ఆయన వివరణ కోసం నోటీసు జారీకి ఆమోదించామని ముక్తాయింపు ఇచ్చారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనకు రిటైర్మెంటు ప్రకటిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని రమణ దీక్షితులు పేర్కొన్నారు. తనపై కక్షగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తిరుమల కట్టడాలను, స్వామివారి అభరణాలను, శాస్త్ర సంప్రదాయాలను సంరక్షించుకోవలసిన అవసరాన్ని సూచిస్తూ విూడియా ముందుకు వస్తే మాపై కక్షతో రిటైర్మెంట్‌ ప్రకటించారని ఆగ్రహించారు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా పోరాడతామన్నారు. మొత్తంగా తిరుమలలో స్వామివారి విూద భక్తితో భక్తులు సమర్పించే కానుకులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. భక్తులకు ఏ రకంగా సేవలు చేయాలన్న దానిని పక్కన పెట్టి తిరుమలకు వచ్చే విఐపిలకు మాత్రం రాజభోగం చేయిస్తున్నారు. విఐపిలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయాలు అమలవుతున్న తీరు భక్తకోటికి నిరాశ కలిగిస్తోంది. దీనిపై పునరాలోచన చేయకుంటే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు.

Other News

Comments are closed.