తుదిదశకు పంచాయితీల ఏర్పాటు

share on facebook

మెదక్‌,జనవరి25(జ‌నంసాక్షి):ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25లోపు కొత్త పంచాయతీల వివరాలను సమగ్రంగా అందజేయాలని సీఎం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. దీంతో కొత్త పంచాయతీల కసరత్తు తుదిదశకు చేరుకున్నది. పల్లెకు సంబంధించిన మ్యాపు, జనాభా, అప్పటి సర్వే నెంబర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మండలాల వారీగా కొత్త పంచాయతీల జాబితా జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరగా..వాటిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 151 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయొచ్చని నివేదిక సిద్ధం చేశారు. 500 జనాభా ఎక్కువ ఉన్న తండాలు, పల్లెలతోపాటు 500 జనాభా తక్కువగా ఉండి ప్రస్తుత పంచాయతీకి 10 నుంచి 15 కిలోవిూటర్ల దూరంలో ఉన్న పల్లెలను పంచాయతీలుగా మారుస్తున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 151 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో ప్రస్తుతం 320 గ్రామాలు ఉండగా..కొత్త పంచాయతీలు 151 కలుపుకుంటే ఆ సంఖ్య 471కి చేరనుంది. పంచాయతీరాజ్‌శాఖ లెక్కలు అంటే పాత మండలాల ప్రకారం కొత్త పంచాయతీలను గుర్తించారు. అయితే ప్రస్తుత గ్రామ పంచాయతీలైన నర్సాపూర్‌,తూప్రాన్‌,రామాయంపేటలకు నగర పంచాయతీ ¬దా దక్కే అవకాశముండడంతో కొత్త పంచాయతీల సంఖ్య అటుఇటుగా మారే అవకాశం ఉంది. వివరాలతో కూడిన కొత్త గ్రామ పంచాయతీల జాబితాను డీపీవో ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. వాటిని ఇక్కడ అధికారులు పూర్థి స్థాయిలో పరిశీలిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న కొత్త గ్రామ పంచాయతీల జాబితాను సిద్ధం చేసిన అధికారులు వాటిని ప్రజా ప్రతినిధులకు అందించనున్నారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి పూర్తి వివరాలతో కూడిన జాబితాను పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.

Other News

Comments are closed.