తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదు

share on facebook

– అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ
– షోకాజు నోటీసులివ్వకుండానే నన్ను సస్పెండ్‌ చేశారు
– గిరిజన రిజర్వేషన్‌లు కోరినందుకే తనను సస్పెండ్‌ చేశారా?
– తాను ఎన్నికల్లో పోటీ చేయను
– ఎమ్మెల్సీ రాములు నాయక్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ఆరోపించారు. తెరాస నుంచి ఆయనను సస్పెన్షన్‌ చేయడంతో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్‌ కోరినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారా? అని నిలదీశారు.  తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన నేతల ఇంటికి వెళ్లి కేటీఆర్‌ డిన్నర్‌లు చేయలేదా అని ప్రశ్నించారు. 2014లో టికెట్‌ కోసం గాంధీభవన్‌ చుట్టూ పల్లా రాజేశ్వరరెడ్డి తిరగలేదా అని ప్రశ్నించారు. నన్ను కేసీఆర్‌ సస్పెండ్‌ చేసి ఉంటే గర్వపడేవాడినని అన్నారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు.. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హావిూ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్‌ గతంలో హావిూ ఇచ్చారని, ఆ హావిూ ఇవప్పుడేమైందని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారని, తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హావిూ ఇచ్చారని అదేమైందని ప్రశ్నించారు. మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. గిరిజన ఐఏఎస్‌లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదన్నారు. గిరిజనులంటే తెరాస ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్‌, కొండా సురేఖను సస్పెండ్‌ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ.. షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలే కాదు పదోతరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదే అన్నారు. తెలంగాణలో ఈ రోజు చూస్తుంటే బాధేస్తోందన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, గిరిజన మేదావులతో సమావేశమై  తదుపరి విషయాలపై చర్చిస్తానని రాముల్‌ నాయక్‌ తెలిపారు.

Other News

Comments are closed.