తెలంగాణలో కొలువుదీరిన కొత్తమంత్రివర్గం

share on facebook

పదిమందితో ప్రమాణం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌
సిఎం కెసిఆర్‌తో కలసి 12కు చేరిన మంత్రుల సంఖ్య
తొలుత ఇంద్రకరణ్‌ రెడ్డి..చివరగా మల్లారెడ్డి ప్రమాణం
తెలుగులోనే ప్రమాణం చేసిన మంత్రులు
పాతకొత్తల కలయికగా కేబినేట్‌కు రూపం
విధేయులకే పట్టం కట్టిన సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంగళవారం ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పది మంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దాదాపు రెండు నెలల విరామం తరవాత సిఎం కెసిఆర్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.  పది మంది ఎమ్మెల్యేల చేత గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. మొదట నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చివరగా మేడ్చెల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రమాణం చేశారు. మంత్రులుగా ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన అనంతరం నేతలు కేసీఆర్‌ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రులంతా తెలుగులోనే ప్రమాణం చేయడం విశేషం. అందరూ ఊహించినట్లుగానే ఈ విస్తరణలో హరీష్‌ రావు, కెటిఆర్‌లకు చోటు దక్కలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవానికి మొత్తం 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు.  శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబరు 13న సీఎం కేసీఆర్‌, మంత్రి మహమూద్‌అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. తర్వాత 66 రోజులకు విస్తరణ జరిగింది. మంత్రివర్గ కూర్పుపై సీఎం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సవిూకరణాలు, అనుభవం, రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తుది జాబితాను రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ¬ంమంత్రి మహముద్‌ అలీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో పనిచేసిన ఈటల రాజేందర్‌, జీ జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు సీఎం కేసీఆర్‌ రెండో దఫా అవకాశం కల్పించారు. నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి కొత్తవారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఇప్పటివరకు మంత్రిగా పనిచేయలేదు. ఆయన మొదటిసారి మంత్రి అవుతున్నారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా క్యాబినెట్‌ ¬దాలో పనిచేశారు. కొప్పుల ఈశ్వర్‌ తెలంగాణ మొదటి అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేయగా, వేముల ప్రశాంత్‌రెడ్డి మిషన్‌భగీరథ
ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. వీ శ్రీనివాస్‌గౌడ్‌ను గత ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా సీఎం కేసీఆర్‌ నియమించారు. అయితే కోర్టు కేసు కారణంగా పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దయ్యాయి. దీంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగారు. మల్లారెడ్డి గతంలో ఎంపీగా ఉన్నారు. మొత్తంగా అనుభవజ్ఞులతోపాటు కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి మంత్రులుగా అవకాశం కల్పించారు.అనంతరం గవర్నర్‌, సిఎం కెసిఆర్‌లతో కలసి మంత్రులు గ్రూఫు ఫోటో దిగారు.

Other News

Comments are closed.