తెలంగాణలో దూసుకుపోతున్న గులబీ దండు

share on facebook

కెసిఆర్‌ పథకాలే ప్రచార రథాలు
ప్రజల కళ్లముందు కదలాడుతున్న పథకాలు
ఓటేసేందుకు అవే ఆపన్న హస్తాలు
విపక్షాలకు చెక్‌ పెడుతున్న టిఆర్‌ఎస్‌ నేతలు
హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో  తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. కెసిఆర్‌ నాయకత్వాన్ని మరోమారు బలపరిచారు. దీంతో అదే ఉత్సాహంతో ఇప్పుడు గులాబీదండు లోక్‌సభ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుని పోతున్నది.  తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్లలో ఏం జరిగిందన్నదే ముఖ్యం.. ఏమైనా మార్పు కనిపించిందా అన్నదే కావాలి. గతంలో జరగని అద్భుతాలు లేదా కార్యాలు ఏవైనా జరిగాయా అన్నదే ప్రజలు ఆలోచించి టిఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు. ప్రధానంగా ఈ ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌ సమస్యను అధిగమించాం. కరెంట్‌ వెతలతో నానా కష్టాలు పడ్డ సామాన్యులకు, రైతులకు,పారిశ్రామికవేత్తలకు కరెంట్‌ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత తెలంగాణ సిఎం కెసిఆర్‌దే.  ఎవరిని అడిగినా ఈ విషయంలో మొహమాటం లేకుండా చెబుతారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత నాలుగేళ్ల కాలం పరిశీలిస్తే  సిఎం
కెసిఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. పదేళ్లలో చేయలేనివారు రేపు వచ్చి ఏమో చేస్తామని ప్రజలను మభ్యపెడితే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు. ఎందుకంటే కనిపిస్తున్న అభివృద్దిని తక్కువ చేసి, లేనిపోని భ్రమలు కల్పిస్తే ఎలా నమ్ముతాం అని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రుజువు చేశారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల అమలుతో  తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి.  ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయిగా చూడాలి. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా తొలుత  31 జిల్లాలుగా ఆతరవాత 33గా చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది. తెలంగాణ కలను సాకారం చేసిన వ్యక్తిగా ధీరోదాత్త నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా కెసిఆర్‌  పాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చారు.  ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హావిూని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు భాగస్వాములైతే తెలంగాణ పురోభివృద్దిలో కీలకం కానుంది. ఇక మరో విశేషమేమంటే  సమైక్య రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక పథకాలను,చట్టలాను మార్పు చేసుకుంటే తప్ప తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా సాగడం అన్నది కెసిఆర్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముఖ్యమైనవి.  ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగనుంది. దేశానికి ఈ పథకం ఆదర్శం కాబోతున్నది. రెండు పడకగదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. తమకూ అటువంటి ఇళ్లు రాబోతున్నయన్న ఆనందంలో పేదలు ఉన్నారు. రానున్న ఏడాదిలో ఈ కలను సాకారం చేస్తామన్న హావిూ ఇప్పుడు పేదలకు సంజీవినిగా మారింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి.  ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి పేదలకు వరంగా నిలిచాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ కానుంది. నాలుగేళ్లుగా మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగుతోంది. ఇది పక్కాగా అమలయితే తెలంగాణ హరిత తెలంగాణ కావడం ఖాయం. ఇకపోతే రైతులకు గతంలో దేశంలో ఎక్కడా చేయని పనులు చేసి వారికి ఆత్మబందువుగా నిలిచారు. నిరంతర విద్యుత్‌,నీటి సరఫరా, ఎరువులు విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎక్రాకు 8వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలుగానే చూడాలి. ఇక ఇంటింటిక మంచినీటిని అందించే మిషన్‌ భగీరథ పనులు  ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా  కొనసాగుతున్నాయి. దీనికి రూ.42వేల కోట్లు ఖర్చవుతుంది. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే మొడి ధైర్యం కెసిఆర్‌ది. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి ఈ పనులు కనువిప్పు కావాలి.

Other News

Comments are closed.