తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

share on facebook


– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం
– నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం
– లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం
– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క
– వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భట్టి, డి.కె. అరుణ, విజయశాంతి
వనపర్తి, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని, ఆ మేరకు ముందుకు సాగుతున్నామని టీపీసీసీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో భట్టితో పాటు డి.కె. అరుణ, విజయశాంతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ లెక్కలు లేకుండా పోయాయని ఆరోపించారు. లెక్కలు అడిగితే బూతులు మాట్లాడుతున్నారని, తెలంగాణలో అభివృద్ధి దుర్భినిలో వెతికినా కనపడటంలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. తెల్లరేషన్‌కార్డు దారులకు 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అనంతరం ప్రచార కమిటీ కోచైర్మన్‌ డి.కె. అరుణ మాట్లాడుతూ.. తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, లక్ష ఉద్యోగాలు ఇస్తుంది అన్నారు. బుధవారం పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్‌ కు ఓటు వేసి ప్రజలు రుణం తీర్చుకున్నారని, కానీ ఇచ్చిన హావిూలను అమలు చేసి ప్రజల రుణం కేసీఆర్‌ తీర్చుకున్నారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చాడా? డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చిండా? ఇలా మోసం చేసిన పార్టీకి మళ్లీ ఓటేస్తారా? అని ప్రజలను అడిగారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని,  లక్ష ఉద్యోగాలు ఇస్తుంది అని డీకే అరుణ అన్నారు. ఐదు లక్షల రూపాయలతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తుందన్నారు. మెగా డీఎస్సి పెడుతుంది అని తెలిపారు. వనపర్తి సభలో కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్దాలు అని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం 95 శాతం పనులు చేస్తే… పైపై పనులు చేసి 8 లక్షల ఎకరాలకు నీరిచ్చామని చెప్పారు. పాలమూరు ప్రజలు మరోసారి మోసపోరు అని డీకే అరుణ అన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకొని కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడం ద్వారా ప్రజాపాలన జరిగేలా సహకరించాలని కోరారు.

Other News

Comments are closed.