తెలంగాణలో శ్వేత విప్లవం సాధిద్దాం

share on facebook

– సబ్సీడీపై బర్రెల పంపిణీ

– విజయ డైరీకి ఇచ్చినట్లే మిగిలిన డైరీలకు రూ.4 ఇన్సెంటివ్‌

– సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి):తెలంగాణలో పాడి రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్రంలో క్షీర విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాడి రైతులకు సబ్సిడీపై బర్రెల పంపిణీ, విజయ డైరీకి ఇచ్చినట్లే మిగతా డైరీలకు రూ. 4 ఇన్సెంటివ్‌ ఇస్తామని సీఎం ప్రకటించారు. ప్రగతి భవన్‌లో పాడి రైతులతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల మంది పాడి రైతులున్నారని తెలిపారు. తెలంగాణలో ఒక కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయన్నారు. అన్ని కుటుంబాలకు సరిపడా పాల ఉత్పత్తి రాష్ట్రంలో జరగలేదన్నారు. కేవలం ఇప్పుడు డైరీల ద్వారా మొత్తం 7 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు సీఎం. రాష్ట్రానికి కోటి లీటర్ల పాలు అవసరం ఉందన్నారు. రెండు లక్షల మంది పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తామన్న సీఎం.. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, మిగతా వారికి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. బర్రెలను నేరుగా రైతులే కొనుక్కోవాలని సూచించారు. నెల రోజుల్లో డబ్బులు సమకూర్చుతాం.. రెండు నెలల్లో బర్రెలను కొనాలని చెప్పారు. మరో ఆరేడు నెలల తర్వాత పాల ఉత్పత్తి పెరగాలన్నారు. ఇప్పుడున్న 7 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల దాకా పాల ఉత్పత్తి పెరగాలని సీఎం తెలిపారు. త్వరలోనే క్షీర విప్లవం కొనసాగించడానికి ఒక స్కీం తెస్తామన్న సీఎం.. దీనికి సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టినా మొదటి ప్రాధాన్యత రెండు లక్షల మంది పాడి రైతులకు ఇస్తామన్నారు. పాలను దిగుమతి చేసుకుంటున్న మనం.. ఒక సంవత్సర కాలంలోనే ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు కేసీఆర్‌. ఇక పాడి రైతు కుటుంబాలకు ఒక్కొక్క ఇంటికి ఆరు చెట్లను పంపిణి చేస్తాం. ఆ చెట్లను నాటి పెంచాల్సిన బాధ్యత ఆ కుటుంబాలదే అని చెప్పారు.

మిగతా డైరీలకు రూ. 4 ప్రోత్సాహకం అందిస్తాం

విజయ డైరీ రైతులకు రూ. 4 ప్రోత్సాహకం అందించినట్లే.. నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్‌, ముల్కనూరు సొసైటీల్లోని పాడి రైతులకు ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించారు సీఎం. దీన్ని వారంలో అమలు చేస్తామన్నారు. దసరాకు ముందే ఇది జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

Other News

Comments are closed.