తెలంగాణ బిజెపికి కొత్తరక్తం కావాలి 

share on facebook

గత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ హవాతోకేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బిజెపి తెలంగాణలో మాత్రం తన పట్టును నిరూపించుకోలేక పోయింది. దీనికి ఇక్కడి నాయకత్వం పటిష్టంగా లేకపోవడమూ ఓ కారణంగా చూడాలి.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా విడివడ్డ తెలంగాణకు పెద్దగా ఒరగబెట్టింది కూడా ఏవిూ లేదు. దీనికితోడు ఇక్కడి నాయకత్వం కేంద్రంతో మాట్లాడి ఏవైనా పనులు సాధించారా అంటే శూన్యం.గత ఎన్నికలో టిడిపితో జతకట్టి కేవలం ఒక్క పార్లమెంటు, ఐదు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అందులో ఓ స్థానంలో ఉన్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాత్రమే ఈ ఎన్నికల్లో సొంతంగా నెగ్గుకుని వచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు  లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డిలు సహా ఓటమి పాలయ్యారు. రద్దయిన ఐదు అసెంబ్లీ సీట్లలో కేవలం ఒక్కటి మాత్రమే  దక్కించు కోగలిగారు. అంటే బిజెపి పట్ల ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ ఉందో, వారి నాయకత్వం పట్ల ప్రజలకు ఎంతటి విశ్వాసం  గమినించవచ్చు. నిజానికి ఈ నాలుగున్నరేళ్లలో బిజెపి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేక పోయింది. అధికార టిఆర్‌ఎస్‌ను మరపించేలా కార్యక్రమాలు చేయలేకపోయింది. టిఆర్‌ఎస్‌ను తిడితే బిజెపిని మెచ్చుకుంటారన్న ధోరణి తప్ప మరోటి వారి ఎజెండాలో లేకుండా పోయింది. బయ్యారం ఉక్కు, హైకోర్టు విభజన, గిరిజన విశ్వ విద్యాలయం తదితర అంశాల్లో స్థానిక బిజెపి నాయకత్వ వైఫళ్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇకపోతే ఉన్న ఒక్కగానొక్క ఎంపి దత్తాత్రేయను అవినీతి కారణంగా మంత్రి పదవది నుంచి ఊడబెరికారు. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా పార్టీ అభాసు పాలయ్యింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్‌లోనే లక్ష్మణ్‌ మూడోస్థానంలో నిలిచారంటే ఎంతటి ఆదరణ ఉందో తెలుసుకోవచ్చు. కనీసం ఈ నియోజకవర్గంలో పర్యటించి సొంత ప్రజల సమస్యలను తెలుసుకునే తీరిక కూడా లక్ష్మణ్‌కు లేదంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇకపోతే ఇదే ప్రాంతంలోని రామ్‌నగర్‌లో  ఎంపి  దత్తాత్రేయ ఉంటున్నా కూడా ప్రజలకు పెద్దగా ఒరిగిందేవిూ లేదు. పార్టీ నిప్పు అని మోదీ చెబుతుంటే ఇక్కడ తుప్పు పట్టిస్తున్నారు.  అంటే వీరు ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నచందంగా ఉంది. అలాంటప్పుడు వీరు రాష్ట్రంలో ప్రభావం చూపుతారని అనుకుంటే పొరపాటు కాక మరోటి కాదు. కేంద్రమంత్రిగా దత్తాత్రేయ కేవలం తనచుట్టూ ఉన్న కొందరు కోటరీ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉండి వారు చెప్పిన పనులనే చేస్తున్నారన్న ఆరోపణలు రాగా ఆయనను కేబినేట్‌ నుంచి తొలగించారు.  పైరవీలకు దత్తాత్రేయ అనుచరులు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు బహిరంగ రహస్యంగా మారాయి.  అందుకే బిజెపి అంటే ప్రజల్లో ప్రభావం లేకుండా పోయింది. ఇవన్నీ బిజెపి నేతలకు తెలియంది కాదు. ఎపిలో నేతలు పట్టుబట్టి ఇప్పుడు ప్యాకేజీలు, ఆర్థిక సాయాలు, వివిధ సంస్థలు తెచ్చుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో బలాన్ని చాటారు. అయితే తెలంగాణకు ఇస్తామన్న మేరకు హావిూలను సాధించే సత్తా కూడా ఇక్కడి బిజెపి నేతలకు లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం అధికారికంగా తెలంగాణ విమోచన జరపాలన్న డిమాండ్‌తో తిరంగా యాత్రలతో ప్రజలను మభ్య పెడుతున్న తీరు తప్ప ప్రజల్లో వారికి కమిట్‌మెంట్‌ లేకుండా పోయింది. అందుకే ఎన్నికల్లో ఉత్తరాది నుంచి హూఏమాహేవిూలు వచ్చి ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది.  దీంతోఒరిగేదేవిూ లేదని ప్రజలు కూడా గమనించారు. గట్టిగా తాము కేంద్రం ద్వారా పోరాడి ఇది సాధించామని చెప్పగలిగే పనులు ఒక్కటి కూడా లేవు.  కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానంగా ఉండి సమస్యలను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారు. నిజంగా చెప్పాలంటే చేతగాకుండా మిన్నకుండి పోయారు. హైకోర్టునే తీసుకుంటే దానిని విభజన చేయించే దమ్ము ధైర్యం కూడా ఈ నేతలకు లేదని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదు. బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా రాష్ట్ర నేతలు మాత్రం తమ కార్యాచరణను ప్రకటించడం లేదు. పొలిటికల్‌ గ్యాప్‌ను క్యాష్‌ చేసుకోవడంలో కాషాయదళం విఫలం అవుతుందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనం.కేంద్రంలో అధికారంలో ఉండడంతో పార్టీకి కావాల్సిన అన్ని  అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయినా  నాయకత్వంలో ఎక్కడో లోపం కనిపిస్తోంది.  తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్‌తో సమానంగా పోరాడి, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించినా ఇప్పుడు క్రెడిట్‌ అంతా కెసిఆర్‌ కొట్టేసినా దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేదు. వీరు సత్తా చాటి కనీసం హైకోర్టు విభజన చేయించినా ఆ క్రెడిట్‌ బిజెపి ఖాతాలో పడేది. దగ్గరుండి ఉద్యోగుల విభజన చేయించినా ఆ ఖ్యాతి వీరికి దక్కేది. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా మైలేజిని సొంతం చేసుకోవడంలో వచ్చిన అవకాశాలను వినయోగించుకోవడంలో బిజెపి నేతలు విఫలమవుతున్నారు.  సిద్దాంతాల ప్రాతిపాదికన రాజకీయాలు చేసే పార్టీగా గుర్తింపు ఉన్న బిజెపి తెలంగాణలో ఎందుకు ఎదగలేక పోతుందన్న చర్చ చేయడం లేదు. కేవలం మోడీని చూపి అ¬ బ్రహ్మాండం..ఒ¬ బ్రహ్మాండం అంటూ అవినీతి రహిత పాలన అంటూ చంకలు గుద్దుకుంటే బిజెపిని ప్రజలు ఆదరిస్తారనుకుంటే పొరపాటుకాక మరోటి కాదని ప్రజలు తమ ఓటు ద్వారా నిరూపించారు.  దక్షణాది రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అగ్రనేత అమిత్‌ షా ఎంతగా చెప్పినా అవిటివాడితో యుద్దానికి వెల్లినట్లుగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తూ పోతే బిజెపి ఎప్పటికైనా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యే పార్టీగానే ఉంటుందని రుజువయ్యింది.

Other News

Comments are closed.