తొలి వన్డేకు అలెక్స్‌ హేల్స్‌ దూరం

share on facebook

నాటింహామ్‌, జులై12(జ‌నం సాక్షి) : భారత్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలెక్స్‌ హేల్స్‌ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌కు గాయం కారణంగా అలెక్స్‌ను పక్కనపెట్టారు. పర్యాటక భారత జట్టు ఇప్పటికే ఇంగ్లిష్‌ గడ్డపై టీ20 సిరీస్‌ గెలుచుకొంది. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. మరో పక్క సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా వన్డే సిరీస్‌ను దక్కించుకోవాలని కసిగా ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో హేల్స్‌ పాల్గొనలేదు. గాయం కారణంగా అతడు ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని, భారత్‌తో జరిగే తొలి వన్డేకు దూరం కానున్నాడని జట్టు మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఇంగ్లాండ్‌ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బే. ఎందుకంటే గురువారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి వన్డే జరిగిన ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలోనే హేల్స్‌ గత నెల ఆస్టేల్రియాపై 147 పరుగులు సాధించాడు. అచ్చొచ్చిన మైదానంలో జరిగే మ్యాచ్‌కు హేల్స్‌ దూరం కావడం ఇంగ్లాండ్‌ను కలవరపెట్టే విషయమే. ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌తో ఆ జట్టు బలంగా ఉంది. హేల్స్‌ స్థానంలో డేవిడ్‌ మలాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రతి మ్యాచ్‌కు ముందు గాయం తీవ్రతను పరీక్షించిన తర్వాతే హేల్స్‌ను జట్టులోకి తీసుకో వాలో లేదో నిర్ణయం తీసుకుంటామని సెలక్టర్లు తెలిపారు.

Other News

Comments are closed.