‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలి

share on facebook

– పార్లమెంట్‌ గాంధీ విగ్రహం వద్ద టీకాంగ్రెస్‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ‘దిశ’ అత్యాచార నిందితులను శిక్షించాలంటూ.. పార్లమెంట్‌ భవన్‌ వద్దనున్న గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ధర్నా చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలంటూ ఎంపీలు రేవంత్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, కుంతియా, ఎం ఏ ఖాన్‌ లు డిమాండ్‌ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బాధితురాలి ఆచూకీకోసం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకరావాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో చర్చ లెవనెత్తుతామని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఏడు సంవత్సరాలు అయిన ఇంకా నిందితులకు శిక్ష పడలేదని మరో ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆ ఘటనలో నిందితులకు ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లనే దేశంలో రోజుకో అత్యాచారం జరుగుతున్నదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందన విచిత్రంగా ఉందని, రాత్రి ఎనిమిది గంటల తర్వాత మహిళలను బయటకు పోవద్దని ఆయన ఎలా చెబుతాడని ప్రశ్నించారు. దానికి బదులుగా మగవారినే రాత్రి ఎనిమిది తర్వాత ఇంట్లో మూసివేస్తే బాగుంటుందని సీఎం కు సూచించారు. ఈ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఘటనపై బాధ్యత రాహిత్యంగా మాట్లాడారన్నారు. బుద్ది ఉన్నవాడు ఎవరూ రాత్రి ఎనిమిది తర్వాత మహిళలను బయటకు పోవద్దు అని చెప్పరని సీఎంని ఉద్దేశించి అన్నారు. రాత్రి వేళ్లలో ఉద్యోగాలు పూర్తయిన తరువాత ఇళ్లకు చేరేవారికి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోనే రక్షణ కల్పించాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.