దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన 

share on facebook

– కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం
– విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి దేవినేని ఉమ
– పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
– ఇంద్రకీలాద్రిపై జై కేసీఆర్‌ అంటూ అభిమానుల నినాదాలు
– నగరంలో దారి పొడవును ప్లెక్సీల ఏర్పాట్లు
విజయవాడ, జూన్‌28(జ‌నం సాక్షి) : ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్‌ ఆలయంలోనికి ప్రవేశించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ విజయవాడ బయలుదేరారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంచార్జ్‌ కలెక్టర్‌ విజయ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా కేసీఆర్‌ నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్‌ ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్‌ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసీఆర్‌ వెంట తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎంపీ బాల్కన్‌ సుమన్‌, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే  తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను మొక్కిన దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇదివరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరవిూసం మొక్కు చెల్లించారు. వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ఉన్న దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ముక్కు పుడక 11.29 గ్రాముల బరువు ఉంది. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవస్థానం మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికింది.
విజయవాడలో కేసీఆర్‌ అభిమానుల హల్‌చల్‌!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై టీఆర్‌ఎస్‌ అధినేత అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. గురువారం విజయవాడ దుర్గమ్మకు మొక్కలు సమర్పించుకునేందుకు కేసీఆర్‌ కుటుంబసమేతంగా హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులులు ‘జై కేసీఆర్‌.. జై జై కేసీఆర్‌..’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అభిమానం చాటుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం చెబుతూ నగరంలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేతల బ్యానర్లు, పార్టీ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Other News

Comments are closed.