దేశంలో మహాకూటమి వల్ల.. ఇబ్బందులే ఎక్కువ


– బీజేపీతో ఉన్న పార్టీలను బాబు ముందు విడదీయాలి
– ఎన్నికల తరువాత కూటమి ఏర్పడితే మంచిది
– నోట్ల రద్దులో చంద్రబాబు పాత్ర ఉంది
– ఇప్పుడు చంద్రబాబు మాటమార్చడం సిగ్గుచేటు
– బాబును విమర్శించే జగన్‌.. మోదీని ఎందుకు నిలదీయడం లేదు?
– సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
విజయవాడ, నవంబర్‌10(జ‌నంసాక్షి) : దేశంలో మహాకూటమి వల్ల సానుకూలం కన్నా ఇబ్బందులే ఎక్కువని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు పేర్కొన్నారు. శనివారం విజయవాడలో సీపీఎం రాష్ట్ర వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు బీజేపీ వ్యతిరేక శక్తులను కలవడం వృథా అని, బీజేపీతో ఉన్న పార్టీలను చంద్రబాబు విడదీయాలని రాఘవులు అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు సిద్ధమవ్వాలని తెలిపారు. ఎన్నికల తర్వాత మహాకూటమిగా ఏర్పాటైతే మంచిదని
అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు నడుం భిగించాలన్న రాఘవులు.. ఎన్డీఏ దుష్టపాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్డీయే తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై భారాలు మోపాయన్నారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉగ్రవాద చర్యలు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. మేం చెప్పడం వల్లే మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు కరెక్టే కానీ.. 2000 రూపాయల నోట్లు ముద్రించడం తప్పని చంద్రబాబు నేడు చెప్పడం సిగ్గుచేటన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడమే కాకుండా చిన్నా, పెద్దా వ్యాపారులు రోడ్డున పడ్డాయని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దులో మోడీతోపాటు చంద్రబాబుకు కూడా పాపం ఉందని రాఘవులు అన్నారు. చంద్రబాబు రెండు చెంపల విూదా లెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2009ఎన్నికల ముందు బీజేపీపై విమర్శలు చేసిన చంద్రబాబుకు… ఎన్నికల అనంతరం అదే పార్టీ సానుకూలమైందా అని ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే యూ టర్న్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుస్తాయని రాఘవులు ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలవం వృథా ప్రయాస అని, ఆయనకున్న స్నేహాలతో బీజేపీ మిత్ర పక్షాలనే బయటకు లాగాలని సూచించారు. బీజేపీకి ఎన్నికలొస్తేనే రామమందిరం గుర్తొస్తుందా అని రాఘవులు ప్రశ్నించారు. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి మహిళలు వెళ్తే తప్పేంటన్నారు. వైసీపీ అధినేత జగన్‌.. చంద్రబాబును విమర్శిస్తాడుగానీ.. మోడీ పట్ల మౌనవ్రతం పాటించడంలో ఆంతర్యమేంటని రాఘవులు ప్రశ్నించారు. ప్రశ్నించారు.