దేశవ్యాప్తంగా బంద్‌ విజయవంతం

share on facebook

– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నేతలు
– రామ్‌లీలా మైదానం వద్ద ఆందోళనలో పాల్గొన్న రాహుల్‌
– ముంబయి, పూణెళిల్లో టైర్లకు నిప్పు, బస్సులపై రాళ్లదాడి చేసిన ఆందోళన కారులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : దేశంలో ఇంధన ధరలు పెరగడంతో పాటు రూపాయి విలువ తగ్గుముఖం పట్టడంతో కాంగ్రెస్‌, వామపక్షాలు నేతృత్వంలోని చేపట్టిన ఈ బంద్‌లో కనీసం 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. రాజ్‌ఘాట్‌ నుండి రామ్‌లీలా మైదానం వరకు సాగిన నిరసనల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. శరద్‌ పవార్‌, ఎంకె స్టాలిన్‌ వంటి ప్రతిపక్ష నేతలు బంద్‌కు మద్దతునిచ్చారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చిన హర్తాళ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కాన్పూర్‌ జిల్లాలో రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేశారు. అక్కడి ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఈ బంద్‌ ప్రభావం కనిపించింది. గుజరాత్‌లో భారత్‌బంద్‌లో భాగంగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేదావాలాతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. జైపూర్‌లో కేందప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలో ముంబయి, పుణెల్లో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అక్కడక్కడ చిన్నపాటి ఆందోళనలు చోటుచేసుకున్నాయి. టైర్లకు నిప్పంటించడం, బస్సులపై రాళ్లదాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాహుల్‌గాంధీ మొట్టమొదటి బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా రాజధానిలో జరిగిన నిరసనలలో పాల్గొన్నారు. కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యూలర్‌ – కాంగ్రెస్‌ కూటమి నిరసనలు వ్యక్తం చేస్తుంది. పలు చోట్ల రోడ్డు సర్వీసులు నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఉబెర్‌, ఓలా డ్రైవర్‌ గ్రూపులు, ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌, కర్ణాటక రాఖీనా వేదికే వంటి ఇతర సంస్థలు భారతబంద్‌ నిరసనల్లో పాల్గొన్నాయి. ఒడిశాలో కూడా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ చర్యను ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ తిరస్కరించారు. ఎటువంటి విధ్వంస కాండకు తావున్వికూడదని కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ సూచించింది. తమిళనాడులో డిఎంకె నాయకుడు ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ డాలర్‌తో రూపాయి విలువను అడ్డుకునేందుకు, ఇంధన ధరలు నియంత్రించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను జిఎస్‌టిలోకి చేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ నేత రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు.
రామ్‌లీలా మైదానంలో..
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, ఎల్‌జేడీ నేత శరద్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపుతో పెట్రో ధరల్ని అదుపుచేయాలని, చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ఇతర నేతలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గోన్నారు.
ప్రభుత్వాన్ని మార్చే సమయం తొందర్లోనే ఉంది – మన్మోహన్‌సింగ్‌
రాంలీలామైదానం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ఎంతో చేశారు కానీ.. అవేవీ జాతి ప్రయోజనాల కోసం కాదని ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఈ దేశ ప్రయోజనాలకు అవసరం లేనివెన్నో చేసిందని, అన్ని పరిమితులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విసుగెత్తిపోయారని, రైతులు అసంతృప్తిలో ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లేక ఆందోళన చెందుతున్నారని, ఇక ప్రభుత్వాన్ని మార్చే సమయం తొందర్లోనే వస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, ఏకతాటిపై నిలబడి భాజపాకు వ్యతిరేకంగా పోరాడాలి అని మన్మోహన్‌ అన్నారు.

Other News

Comments are closed.