దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా?

share on facebook

 

– ప్రతి ఒక్కరికి రూ. 5లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం

– త్వరలో బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్న కేంద్ర ప్రభుత్వం?

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఆర్థిక సంస్కరణలతో సామాన్యుడికి ఒకింత కోపం తెప్పించిన మోదీ సర్కారు.. ఎన్నికలు సవిూపిస్తోన్న తరుణాన ప్రజా ప్రయోజన పథకాల దిశగా అడుగులేస్తోంది. మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆకట్టుకొనేలా బడ్జెట్‌ను రూపొందించేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే గురువారం అన్ని రాష్టాల్ర ఆర్థికశాఖ మంత్రులతో భేటీ అయిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆయా రాష్టాల్ర ఆర్థికశాఖ మంత్రుల వినతులు స్వీకరించారు. ఆయా రాష్టాల్రకు బడ్జెట్‌లో పెద్దపీట వేయాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఏఏ రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి, పేద ప్రజల అభ్యున్నతికి ఏ విధంగా మేలు చేయగలుగుతామనే దానిపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క దేశ ప్రజలందరికీ త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పించనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా ఈ మొత్తాన్ని కేటాయించే వీలుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ విూడియా కథనాన్ని ప్రచురించింది. ప్రజల ఆరోగ్య బీమా కోసం కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించనున్నాయని సదరు పత్రిక తెలిపింది. ఆరోగ్య బీమా అమలు కోసం ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆరోగ్య బీమా పథకాన్ని మూడు రకాలుగా విభజించనున్నారని, దారిద్య రేఖకు దిగువనున్న వారంతా కల్యాణ్‌ పథకం పరిధిలోకి వస్తారు. వీరికి బీమా మొత్తాన్ని ప్రభుత్వాలే చెల్లిస్తాయి. రూ. 2 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు సౌభాగ్య పథకం పరిధిలోకి వస్తారు. వీరు నామమాత్రం సొమ్ము చెల్లించి బీమా సదుపాయం పొందొచ్చు. రూ. 2 లక్షలకు మించి వార్షికాదాయం ఉన్నవారు సర్వోదయ పథకం పరిధిలోకి వస్తాయి. దేశంలో ప్రస్తుతం 4 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఆరోగ్య బీమా పథకాలను తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం ద్వారా సామాన్యుడికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. గత కొన్నేళ్లుగా ఆదాయపన్ను మినహాయింపు కోరుతున్న ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో ఊరట లభించేలా కేంద్రం నిర్ణయం ఉండనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల ముగింట పూర్తి స్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వీలుండదు. దీంతో ఈ బడ్జెట్‌లోనే వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 2.5 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వస్తున్నారు. దీన్ని రూ. 3 లక్షలకు వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా ఆదాయ పన్ను శ్లాబులను మార్చాలని కూడా మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణంతో ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వేతన జీవులకు ఊరట కల్పించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత బడ్జెట్లో ఆర్థిక శాఖ ఐటీ పరిమితిని పెంచనప్పటికీ.. రూ. 5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. నోట్ల రద్దు ప్రభావం, జీవన వ్యయం పెరగడంతోపాటు ఎన్డీయే సర్కారుకు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో ఆదాయ పన్ను పరిమితి పెరిగే అవకాశాలు ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచే వీలుందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.1.5 లక్షల్లోపు సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు ఇస్తుండగా.. దీన్ని రూ.2 లక్షలకు పెంచే వీలుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ బడ్జెట్‌లో ప్రజలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Other News

Comments are closed.