దొంగ సర్వేలతో.. ప్రజల మనస్సులను మార్చలేరు

share on facebook


– గెలుపు గుర్రాలనే ఎంపికచేశాం
– తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు
– నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైకాపా మారింది
– మైండ్‌ గేమ్‌ మాత్రమే కాదు.. జగన్‌ సైకోగేమ్స్‌లో దిట్ట
– దిక్కుతోచని స్థితిలో ఎంతటి అరాచకాలకైనా సిద్ధమవుతారు
– తెదేపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వాటిని ఎదుర్కోవాలి
– నామినేషన్‌ల పర్వంలో జాగ్రత్తలు వహించండి
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి19(జ‌నంసాక్షి) : అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని, ఆ మేరకు కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలోని తన నివాసంలో పార్టీ నేతలతో మంగళవారం చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. దొంగ సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న సానుకులతను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని పథకాల లబ్ధిదారులు కసి, పౌరుషంతో ఉన్నారని, దీంతో వైకాపాకు ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. దిక్కు తోచని స్థితిలో ఎంతటి అరాచకాలకైనా వైకాపా సిద్ధమవుతోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. నామినేషన్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. వీవీ ప్యాట్‌ మెషిన్లపై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌ లోపు వైసీపీ మరెన్ని అక్రమాలు చేస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల తేది, ఉప సంహరణ, పోలింగ్‌ వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే మంచి ఫలితాలుంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇక వైసీపీ అభ్యర్ధుల ప్రకటన విధానంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు.. అభ్యర్ధుల ప్రకటనతోనే వైసీపీ ఎలాంటి పార్టీనో అర్ధమవుతోందని విమర్శలు చేశారు. అటు, ఇటు నేరగాళ్లతో జగన్‌ అభ్యర్ధుల ప్రకటన చేశారని.. ఒక వైపు నందిగం సురేష్‌, మరోవైపు ధర్మాన ప్రసాదరావు.. మధ్యలో 12 చార్జిషీట్లలో ఏ1 నిందితుడు జగన్మోహన్‌ రెడ్డి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. అరటి తోటలు తగులపెట్టిన కేసుల్లో నిందితుడు సురేష్‌ అయితే, కన్నెధార గ్రానైట్‌ కొండలు తవ్వేసిన నిందితుడు ధర్మాన అని, జగన్‌ నేరాల కళంకిత మంత్రులలో ధర్మాన అగ్రగణ్యుడని చంద్రబాబు విమర్శలు వేశారు. అది అభ్యర్ధుల ప్రకటనా..? నేరగాళ్ల ప్రకటనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మనపోటీ నేరగాళ్ల పార్టీతో అన్నారు. ఎన్నికల్లో సైబర్‌ నేరగాళ్ల అరాచకం పెరిగిందన్నారు. సైబర్‌ నేరగాళ్లంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లో చేరారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నేరగాళ్ల కేరాఫ్‌ అడ్రస్‌ గా వైకాపా మారిందని.. మైండ్‌ గేమ్స్‌ మాత్రమే కాదు జగన్‌  సైకోగేమ్స్‌ లో దిట్టఅని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వివేకా హంతకులను వదిలిపెట్టను..
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హంతకులను వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు
హెచ్చరించారు. వివేకా హత్య ఇంటి దొంగల పనేనని జగన్‌ అనుచరులే అంటున్నారని గుర్తుచేశారు. గుండెపోటు డ్రామాలో గంగిరెడ్డి కూడా భాగస్వామేనన్నారు. మృతదేహానికి కట్లు కట్టడం, కుట్లు వేయడమేంటి..? అని ప్రశ్నించారు. వివేకా డ్రైవర్‌కు ప్రాణహాని ఉందన్నవాళ్లు ఎవరినుంచి అనేది కూడా చెప్పాలన్నారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని జగన్‌ నిస్సిగ్గుగా అడుగుతున్నారని విమర్శించారు. నేరాలు, దోపిడీలు, హత్యలు చూసి జగన్‌కు అవకాశం ఇవ్వాలా? అని అడిగారు. ఒక వేళ అవకాశం ఇస్తే రాష్ట్రాన్నే కాదు జనాన్ని కూడా మింగేస్తారని ఆరోపించారు. జగన్‌ హత్యా రాజకీయాలతో రాష్ట్రానికి అప్రదిష్ట ఏర్పడిందన్నారు.

Other News

Comments are closed.