నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం

share on facebook

నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు

ఖమ్మం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట సారా ఊహించనిస్థాయిలో ఉండేది. 2015 డిసెంబరు నుంచి సారా రహిత జిల్లాగా ప్రకటించారు. కానీ 2016 జూన్‌ నుంచి జిల్లాలో మళ్లీ పుంజుకుంది. అధికారులు దీనిపై దృష్టి సారించకపోడంతో తయారీ, విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నల్లబెల్లం మాదిరిగానే తెల్లబెల్లంను నీటిలో కలుపుతున్నారు. గుంతలో కొంతకాలంపాటు నిల్వ చేస్తారు. బాగా పులిసిన తర్వాత బట్టీలను ఏర్పాటు చేసి గుడుంబాను తయారు చేస్తున్నారు. నిషేధం మాటున గుడుంబాకు ధరనూ విపరీతంగా పెంచారు. గుడుంబా పూర్తిగా నిషేధించినా గ్రామాల్లో దొరుకుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం కూడా దొరుకుతోంది. నల్లబజారులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో తెల్లబెల్లంను వినియోగిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెంలో మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ కేవలం చక్కెరతోనే సారా తయారు చేస్తున్నారు. నలభైశాతం మళ్లీ సారా వ్యాపారం పెరిగింది. ఏన్కూరు, తల్లాడ, కొణిజర్ల, మధిర, కారేపల్లి, నేలకొండపల్లి, ఖమ్మం పట్టణం, గ్రావిూణం, చింతకాని వంటిచోట్ల సారా విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతిస్టేషన్‌ పరిధిలో సారా మళ్లీ జడలు విప్పుకుంది. గతంలో నల్లబెల్లంతో సారాను కాసేవారు. దీనిపై ఉక్కుపాదం మోపడంతో తెల్లబెల్లాన్ని ఆశ్రయిస్తున్నారు. సాక్షాత్తూ ఆబ్కారీశాఖాధికారులు దీనిని ధ్రువీకరించారు. ఇంటి అవసరాలకు, వంటలకు ఉపయోగించే తెల్లబెల్లంను కొందరు వ్యాపారులు, దుకాణదారులు పక్కదోవ పట్టించడం మొదలుపెట్టారు. సారా తయారీదారులు అవకాశం ఉన్న చోట్ల క్వింటాళ్లుగా దీనిని కొనుగోలు చేయడం, అవకాశం లేనిచోట పలువురిని పంపించి ఐదు నుంచి 10 కేజీల చొప్పున కిరాణ దుకాణాల్లో కొనడం ప్రారంభించారు. ఇలా ఏదో ఒకమార్గంలో తెల్లబెల్లాన్ని సారా తయారీలో వినియోగించేందుకు కొనుగోలు చేయడం మాత్రం తగ్గడం లేదు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వాపురం, పాల్వంచ పరిసర గ్రావిూణ ప్రాంతంల్లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపుగా అందరూ తెల్లబెల్లంను విక్రయిస్తున్నారు. ఖమ్మంలోని ఓ ప్రధాన సెంటర్లో తెల్లబెల్లం విక్రయాలు ¬ల్‌సేల్‌ పద్ధతిలో భారీగా జరుగుతాయి. కార్పొరేషన్‌ పరిధిలోనే ఇటీవల ఆబ్కారీశాఖ అధికారులు సుమారు నాలుగున్నర టన్నుల తెల్లబెల్లంను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. నేరుగా అక్రమ మార్గంలోకి పంపించడం, ¬ల్‌సేల్‌ నుంచి కిరాణ దుకాణాలకు అక్కడ నుంచి తెలివిగా అవసరమైన వారికి చేరవేసే తంతు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఖమ్మం పట్టణంతోపాటు వైరా, కల్లూరు, ఏన్కూరు, నేలకొండపల్లి వంటి ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలకు దీనిని తరలిస్తున్నారు. కల్లూరు, కొణిజర్ల, కూసుమంచి, మధిర, సత్తుపల్లి వంటిచోట్ల నెలకు కిరాణదుకాణాల నుంచి ఐదు టన్నుల వరకు అమ్మకాలుంటాయి. సారా తయారీకి పెద్దమొత్తంలోనే తరలుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Other News

Comments are closed.