నాలుగో విడత హరితహారం కోసం తెలంగాణ సిద్దం

share on facebook

భూపాలపల్లి వేదికగా సిఎం కెసిఆర్‌ కార్యక్రమం

మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ

హరిత తేదీలను ఖరారు చేనయనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): తెలంగాణలో మరోమారు హరిత ఉద్యమానికి సిఎం కెసిఆర్‌ నాంది పలుకుతున్నారు. గత మూడు డువిడతల్లో ప్రజలను చైతన్య పరచిన కార్యక్రమం నాలుగో విడతకు భూపాలపల్లి జిల్లా వేదిక కానుంది. మూడోవిడతను కరీంనగర్‌ వేదికగా గతేడాది శ్రీకారం చుట్టారు. సిఎస్‌ ఎస్‌కె జోషి ఆదేవాలతో అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు వర్షాలు కూడా మొదలు కావడంతో ఇక తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే సిఎస్‌ ఎస్‌కె జోషి కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న హరిత దళాలు (గ్రీన్‌ బ్రిగేడ్స్‌) ఇప్పటికే వాడవాడలా తమకు అప్పగించిన పనుల్లో నిమగ్నమయ్యాయి. హరితహారం ఆవశక్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. గతేడాది నాటిన మొక్కలను మించి ఈసారి నాటేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు కూడా ఏర్పాట్లు

చేసుకుంటున్నాయి. వీటితోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు.. అన్నింటికి మించి సాధారణ ప్రజలు సంసిద్ధమవు తున్నారు. కోరినవారికి కోరినన్ని మొక్కలు అదించేందుకు అటు అటవీశాఖ సైతం సమాయత్తమయింది. వెరసి.. రాష్ట్రమంతటా హరిత సందడి నెలకొంది. ఈ ఏడాది కనీసం 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని నర్సరీలలో దాదాపు 42కోట్ల మొక్కలను సిద్ధంచేశారు. ఒక్కో నర్సరీలో ఒక్కోరకం మొక్కలను పెంచుతున్నారు. ఈసారి అలంకృత మొక్కలు కాకుండా జీవవైవిధ్యం ఉన్న జాతులు, పండ్లు,

ఫలాలనిచ్చే మొక్కలను ఎక్కువగా పెంచారు. మొత్తం 33 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో హరితహారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత మూడు పర్యాయాల్లో ప్రజలు ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించారు. తాజా విడుతలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం పలు పోత్సాహక విధానాలను అవలంబించనున్నది. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే సామాన్య పౌరులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక బహుమతులిచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. హరితహారంలో ఉత్సాహంగా పాల్గొనే విద్యార్థులకు హరిత విద్యార్థి అవార్డులను,మొక్కల ను బాగా పరిరక్షించే పాఠశాలలకు హరిత పాఠశాల అవార్డులను ఇవ్వనున్నారు. నిర్దేశిత లక్ష్యాన్ని మించి మొక్కలను నాటే పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలకు రెండు లక్షల నుంచి 10లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటా చెట్టు-ఊరంతా పచ్చదనం అన్న నినాదంతో అటవీ శాఖ, పచ్చని పాఠశాల-హరిత తెలంగాణ నినాదంతో విద్యాశాఖ తెలంగాణ హరితహారం కార్యక్రమానికి భారీ సన్నాహాలు చేస్తున్నాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో ప్రత్యేకంగా మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. దాదాపు 30వేల విద్యాసంస్థలలో హరితహారం కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడానికి అన్ని

ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హరిత పాఠశాల-హరిత తెలంగాణ నినాదంతో మూడో దశ హరితహారం కార్యక్రమాన్ని అన్ని విద్యాసంస్థలలో భారీ ఎత్తున నిర్వహించనున్నామన్నారు. రోజు ఉదయం 9గంటల నుంచి గంట పాటు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం విద్యాసంస్థలలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందన్నారు. పర్యావరణంపై విద్యార్థులలో అవగాహన మరింత పెంచడానికి హరితహారం కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన ఉందని కడియం వెల్లడించారు. అలాగే అన్ని విశ్వవిద్యాల యాలు, కళాశాలల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని వర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ఇందుకు అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి ముందుగానే సేకరించుకోవాలని చెప్పారు.

————–

 

Other News

Comments are closed.