నిజామాబాద్‌లో అనూహ్య పరిణామాలు

share on facebook

డిఎస్‌ను పట్టించుకోని కెసిఆర్‌

సురేశ్‌ రెడ్డి చేరికతో అదనపు బలం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఓ వైపు రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ వ్యవహారం అలా ఉండగానే మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సురేశ్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సవిూకరణాలు మారనున్నాయి. గత రెండు ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయినప్పటికీ ఆయన నిబద్దత కలిగిన నేతగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతారని జిల్లాలో ఎవరు కూడా ఊహించలేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డిఎస్‌ వ్యవహారంలో కెసిఆర్‌ కొంత కటువుగానే ఉన్నారు. ఉంటే ఉంటాడు..పోతే పోతాడన్న రీతిలో కెసిఆర్‌ సమాధానమిచ్చారు. ఈ దశలో ధర్మపురిని పక్కన పెట్టినట్లుగానే భావించాలి. అయితే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కెందుకు నిర్ణయించుకోవడం హస్తం నేతల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి కేటీఆర్‌ దౌత్యంతో సురేశ్‌ రెడ్డి పార్టీ మారేందుకు అంగీకరించారు. ప్రస్తుతం సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో మొత్తంగా జిల్లా రాజకీయ సవిూకరణలు పూర్తిగా మారిపోయాయి. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం గణనీయంగా పడనుంది. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో అంతర్మథనానికి గురిచేస్తున్న ఈ అంశం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారనుంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు అదనపు బలాన్ని చేకూర్చనున్నది. పార్టీలో కేఆర్‌ సురేశ్‌రెడ్డి చేరికపై గులాబీ దళం సంతోషంగా స్వాగతించింది. అటు సురేశ్‌రెడ్డి అనుచర వర్గంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాలని సురేశ్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, శాసన సభాపతిగా పనిచేసిన కేఆర్‌ సురేశ్‌రెడ్డికి జిల్లావ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. తన తొలి నియోజకవర్గమైన బాల్కొండ నియోజకవర్గంలో, ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఆయనకు బలమైన వర్గం, అనుచరగణం ఉన్నది. 2009 ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా పీఆర్పీ నుంచి గెలిచిన ఈరవత్రి అనిల్‌ కాంగ్రెస్‌లో చేరాక కూడా

ఆయన అనుచరులు ఆయన వెంటనే కొనసాగారు. ఆయన ఆర్మూర్‌ నియోజకవర్గానికి తరలిపోయాక ఆయన అనుచరగణమంతా సురేశ్‌రెడ్డి వర్గీయులుగానే ఉండిపోయారు. దీంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో సురేశ్‌ రెడ్డి ప్రాబల్యమే కొనసాగుతూ వచ్చింది. ఆర్మూర్‌కు వెళ్లాక అక్కడ ఆయనకు భారీగానే అనుచరులు ఏర్పడ్డారు. కాంగ్రెస్‌ అధిష్టానం సూచనల మేరకు ఆర్మూర్‌ నుంచి పోటీ చేయడం, ఆర్మూర్‌ నియోజకవర్గ బాధ్యతలనే చూసుకుంటూ వచ్చినా.. రెండు నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం బలంగానే ఉంది. ఇప్పుడు ఆయన చేరికతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు.

Other News

Comments are closed.