నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

share on facebook

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదం జరిగింది. మెండోరా సమీపంలో అదుపుతప్పిన ఓ ఆటో బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముప్కాల్‌ నుంచి మెండోరా వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ప్రమాదం సమయంలో ఈ ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉండగా, కొందరు సురక్షితంగా బయటపడినట్టు పోలీసులు తెలిపారు. తొలుత ఓ మహిళ మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీశారు. అనంతరం మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటివరకు పదకొండు మృతదేహాలను గుర్తించారు. మెండోరా సమీపంలో అదుపు తప్పిన ఆటో రోడ్డుపక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆటోకు తాళ్లను కట్టి క్రేన్‌ సాయంతో బయటకు తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి ప్రయాణికులు చేరుకుంటున్నారనగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘోర ఘటనతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవడం వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొంటున్నారు. తొలుత నలుగురు లేదా ఐదుగురు మాత్రమే మృతిచెంది ఉంటారని భావించినప్పటికీ గాలింపు చర్యల్లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు అక్కడ ఉన్నవారిని కలిచివేస్తున్నాయి.

Other News

Comments are closed.