నిమ్స్‌ వైద్యుల నిర్వాహకం

share on facebook

– ఆపరేషన్‌ సమయంలో రోగి కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు
– ఆందోళనకు దిగిన రోగి బంధువులు
హైదరాబాద్‌, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : వైద్యో నారాణో హరి అంటారు.. వైద్యులంటే రోగికి దేవుడితో సమానంగా భావిస్తుంటారు.. కానీ ఆ వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తాజాగా నిమ్స్‌ ఆస్పత్రిలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. నిమ్స్‌ వైద్యులు…ఓ రోగికి  ఆపరేషన్‌ చేసి అతడి కడుపులో కత్తెర మరచిపోయారు.
అయితే ఆ తర్వాత రోగి కడుపు నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో..వారు వైద్యులను సంప్రదించారు. అసలు విషయం ఎక్సరే తీసిన అనంతరం బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్‌కు చెందిన మహేశ్వర్‌ చౌదరి అనే వ్యక్తి మూడు నెలల క్రితం హెర్నియా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడికి తరచుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించాడు. అక్కడ అతడికి ఎక్స్‌రే తీయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు బయటపడింది. దీంతో బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నిమ్స్‌కు రాగా, ఆపరేషన్‌ చేసిన వైద్యులు ప్రస్తుతం అందుబాటులో లేరంటూ సమాధానం ఇవ్వడంతో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన వైద్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యుల నిర్వాహకంపై  పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేపట్టారు.
వైద్యులపై చర్యలు తీసుకుంటాం – నిమ్స్‌ డైరక్టర్‌
రోగికి ఆపరేషన్‌ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన అంశంపై నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ స్పందించారు. కడుపులో కత్తెర మరిచిపోవడం దురదుష్టకరమైన ఘటనన్నారు. మహేశ్వరి చౌదరి(33) అనే మహిళ డైయాఫ్రమెటిక్‌ హెర్నియా వ్యాధితో అక్టోబర్‌ 28న నిమ్స్‌కు వచ్చారని అప్పుడు ఆమెకు సర్జరీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ సమయంలో వైద్యులు ఆమె కడుపులో కత్తెరను మరిచిపోయి కుట్లు వేశారని ఆయన అన్నారు. తీవ్రమైన కడుపునొప్పితో మహేశ్వరి తిరిగి నిమ్స్‌కు వచ్చారని, ఎక్స్‌రే తీయగా ఆమె కడుపులో సర్జికల్‌ కత్తెర ఉన్నట్లు గుర్తించామన్నారు. మహేశ్వరికి ప్రొఫెసర్‌ వీరప్ప, వేణు, వర్మ డాక్టర్లు ఆపరేషన్‌ చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆస్పత్రిలో ఇంటర్నల్‌ కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికలు వచ్చాక ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ వెల్లడించారు.

Other News

Comments are closed.