నిరంతర ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించవచ్చు

share on facebook

పోలీస్‌ నియామక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌
సిద్దిపేట,డిసెంబర3 (జనంసాక్షి) : అసాధ్యమంటూ ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించొచ్చని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు నియామక ఉచిత శిక్షణా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 34 ఉచిత పోలీస్‌ శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో 2015 నుంచి పోలీస్‌ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలా మంది ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలే కాకుండా జాతీయ స్థాయిలో వచ్చే ఉద్యోగాలకు కూడా ప్రయత్నించాలని సూచించారు. శిక్షణకు క్రమం తప్పకుండా హాజరైతే స్టడీ మెటీరియల్‌తోపాటు, టిఫిన్‌, స్పోర్ట్స్‌ మెటీరియల్‌, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులు నిర్లక్ష్యం చేయ కుండా, మంచి సాధనతో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.

Other News

Comments are closed.