నూటికి వెయ్యిశాతం టీడీపీదే గెలుపు

share on facebook

– అభివృద్ధి, సంక్షేమం వల్లే మావిజయం సాధ్యమవుతుంది
– నేను సిద్ధాంతపరంగా పోరాడుతున్నా
– టెక్నాలజీకి మనం బానిసలు అయిపోకూడదు
– వీవీప్యాట్‌ స్లిప్పును ఓటర్‌ సరిచూసుకొనేలా కొత్తవిధానం తేవాలి
– కేథార్‌ నాథ్‌ పర్యటనతో మోదీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు
– మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మే20(జ‌నంసాక్షి) : సర్వేలు చేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందని, ఎవరెన్ని సర్వేలు చేసినా నూటికి వెయ్యిశాతం టీడీపీదే గెలుపు అని, 23న ఫలితాల్లో అదే రుజువవుతుందని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. తెదేపా 35 ఏళ్లుగా సర్వేలు చేస్తోందని.. తెదేపా గెలుపుపై ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం వల్లే తెదేపా విజయం సాధిస్తుందన్నారు. నేను ఒక్క పిలుపు ఇస్తే అందరూ వచ్చి అర్ధరాత్రి దాటే వరకూ ఓటు వేశారన్నారు. అనేక ఇబ్బందులు పడి తెలంగాణ నుంచి వచ్చి ఓటు వేశారని బాబు అన్నారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అందుకే వీవీప్యాట్‌ స్లిప్పులపై నా డిమాండ్‌ను అందరూ ఒప్పుకొంటున్నారన్నారు.  మాజీ సీఈసీ ఖురేషి కూడా నా అభిప్రాయాలను సమర్థించారన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయని,  వీవీప్యాట్‌ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని ఖురేషి చెప్పారని, పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాలన్నారు. వీవీప్యాట్‌ స్లిప్‌ను ఓటరు చేతికి ఇవ్వాలని, ఓటరు సంతృప్తి చెందాక పక్కనున్న బాక్స్‌లో వేయాలన్నారు. ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పుల బాధ్యతలను వేర్వేరు అధికారులు చూస్తున్నారన్నారు. ఐదు వీవీప్యాట్ల లెక్కింపులో తేడావస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఇంకా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని ఈసీ పరిష్కరించాలన్నారు. ఈవీఎంలపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ప్రోగ్రామింగ్‌ చిప్‌ నియంత్రణ ద్వారా ఏదైనా చేయొచ్చునని చంద్రబాబు పేర్కొన్నారు. ‘నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని, అదే సమయంలో టెక్నాలజీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. టెక్నాలజీకి మనం మాస్టర్‌ కావాలే తప్ప దానికి బానిసైపోకూడదన్నారు. అందుకే దేశంలోని తొలిసారి సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌ ను ఏపీలో ఏర్పాటుచేశామని, నేరాలన్నింటిని కంట్రోల్‌ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చన్న ఉద్దేశంతో పేపర్‌ బ్యాలెట్‌ కు పోవాలని మేం డిమాండ్‌ చేశామని, కానీ ఈసీ మాత్రం మధ్యేమార్గంగా వీవీప్యాట్‌ లను ఎంచుకుందన్నారు. వీవీప్యాట్‌ ఒరిజనల్‌ ఐడియా ఏంటంటే ఓటు వేశాక ఎవరికి ఓటు పడిందో తెలుసుకునే స్లిప్పు ఓటర్‌ చేతిలోకి రావాలని, అనంతరం దాన్ని సదరు ఓటర్‌ బ్యాలెట్‌ బాక్సులో వేయాలన్నారు. కానీ ఇప్పుడు ఓటు ఎవరికి వేశామో తెలీదు, ఎవరికి పడిందో తెలీదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు సెకండ్లు ఉండాల్సిన వీవీప్యాట్‌ స్లిప్పు కేవలం మూడు సెకన్లలోపే బాక్సులో పడిపోయిందని చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీవీప్యాట్‌ స్లిప్పును ఓటర్‌ సరిచూసుకుని బ్యాలెట్‌ బాక్సులో వేసేలా విధానం తీసుకురావాలని తాము కోరుతున్నామనీ, ఇందులో అభ్యంతరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు. కేథార్‌ నాథ్‌ పర్యటనకు వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో 89.05 శాతం పోలింగ్‌ నమోదయిందని వ్యాఖ్యానించారు.
ఏపీలో అవసరమైనప్పుడు కేంద్ర సాయుధ బలగాలను పంపలేదని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ రీపోలింగ్‌ సమయంలో విపరీతంగా కేంద్ర బలగాలను మోహరించారని విమర్శించారు. ఈ మోహరింపునకు ఖర్చయ్యే మొత్తం ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.9,000 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన వీవీప్యాట్‌ యంత్రాలు అలంకార ప్రాయంగా మారాయని ఏపీ సీఎం విమర్శించారు. ‘ఫామ్‌-7 వ్యవహారంలో ఈసీ సహకారం అందించలేదన్నారు. ఈ ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఈ దరఖాస్తును ఎక్కడి నుంచి అయినా అప్‌ లోడ్‌ చేయవచ్చునని, ఈ వ్యవహారంలో సిట్‌ ఏర్పాటు చేశామనీ, సమాచారం ఇవ్వాలని ఈసీని కోరామన్నారు. కానీ వాళ్లు స్పందించలేదని, ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి ఎన్నికలకు వచ్చామని, ఐపీ అడ్రస్‌ ఇవ్వకుంటే న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై స్పందిస్తూ..’జగన్‌ నివాసంలో హత్య జరిగితే ఏం చేశారు? ఆధారాలు మాయం చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు ఇలా జరుగుతాయని నేను ఊహించలేదన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మాట్లాడి ఆ తర్వాత ఢిల్లీ వెళ్తానని, అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.

Other News

Comments are closed.