నేడు పట్టభద్రుల పోరు

share on facebook

భారీగా ఏర్పాట్లు చేసిన ఉన్నికల సంఘం

అభ్యర్థులు భారీగా ఉండడంతో జంబో బ్యాలెట్లు ఏర్పాటు

ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, రామచంద్రరావులకు పరీక్ష

తొలిసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న వాణిదేవి

హైదరాబాద్‌,మార్చి13(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఆదివారం రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం భారీ చర్యలు చేపట్టింది.  వరంగల్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అత్యధికంగా ఇక్కడ ప్రముఖులు బరిలో ఉన్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పాటు బిజెపి నుంచి ప్రేమేందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌, స్వతంత్రులగా తీన్మార్‌ మల్లన్న,రాణిరుద్రమదేవి,చెరుకు సుధాకర్‌ లాంటి వారు కూడా బరిలో ఉన్నారు. దీంతో గెలుపు ఎవరికైనా అంత సులభం కాకపోవచ్చని అంటున్నారు. ఇకపోతే హైదరాబాద్‌ నుంచి అనూహ్యంగా పివి తనయ వాణిదేవిని సిఎం కెసిఆర్‌ ప్రకటించండంతో పాటు ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీంతో ఇక్కడ గెలుపు కూడా టిఆర్‌ఎస్‌ వైపు ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు మరోమారు బరిలో నిలిచారు. ఇకపోతే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, కాంగ్రెస్‌ నుంచి చిన్నారెడ్డి,టిడిపి నుంచి ఎల్‌. రమణ బరిలో ఉన్నారు. అనేకులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్‌ పేపర్‌ మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి – హైదరాబాద్‌, ఖమ్మం – వరంగల్‌ – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 14వ జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటువేసే అవకాశముంటుంది. ఓట్లు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్దారించడం కోసం ఓటరు గుర్తింపు కార్డు కానీ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన మరే గుర్తింపుకార్డునైనా చూపాలి. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫోటోతో కూడిన సర్వీస్‌ ఐడెంటిటీ కార్డ్‌, పాన్‌కార్డు, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు

సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ,డిప్లొమా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గ్రేటర్‌ హైదరాబాద్‌ పోలింగ్‌ అనేది చర్చనీయాంశంగా మారడం సాధారణం. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆశించిన స్థాయిలో పోలింగ్‌ నమోదు కాకపోవడం ఒకవంతైతే.. ముఖ్యంగా విద్యావంతులు పోలింగ్‌ రోజు గడప దాటి బయటకు రాకపోవడమనేది ప్రతిసారి జరుగుతున్నదే. ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలోనూ ఇదే తంతు కొనసాగుతుండటంతో అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇందుకు 2015లో జరిగిన హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌ నిదర్శనం. ఆ ఎన్నిక సమయంలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2,96,317 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేయించుకున్నారు. ఇందులో ఏకంగా 45శాతం ఓట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో భాగంగా జరిగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధిలో కేవలం 37.72 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. అంటే 1,11,766 మంది పట్టభద్రులు మాత్రమే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలవారీగా చూసినా హైదరాబాద్‌ జిల్లాలో అతి తక్కువగా 29 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మిగిలిన వారు పోలింగ్‌ కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక.. అత్యధిక ఓట్లు ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ కేవలం 34శాతం మాత్రమే పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. పూర్తి గ్రావిూణ ప్రాంతమైన మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 55శాతం పోలింగ్‌ నమోదు కావడం కొంత ఊరట కలిగించే అంశం.  ఓటర్లు హాలిడే మూడ్‌లో ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పోలింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దని అధికారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. ఓటర్లు అందరూ పట్టభద్రులు అయినందున ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదని హితవు పలుకుతున్నారు. కాగా ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో కంటే ఏకంగా 181శాతం పట్టభద్రుల ఓట్లు పెరిగాయి. మూడు ఉమ్మడి జిల్లాలు ప్రస్తుతం తొమ్మిది కొత్త జిల్లాలుగా రూపాంతరం చెందగా.. పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 5,17,883కు చేరుకుంది.  జాబితాలో 3,27,727 మంది పురుషులు ఉండగా.. 1,90,088 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 68మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే… ఉమ్మడి రంగారెడ్డిలో 2015జాబితాలో 1,33,003 మంది ఓటర్లు ఉండగా… ఈసారి ఆ సంఖ్య 2,94,055కు పెరిగింది. కొత్త జిల్లాలవారీగా చూసినా రంగారెడ్డిలోనే 2015లో మాదిరిగా మిగిలిన జిల్లాల కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పట్టభద్రులు ఎక్కువగా ఓటును నమోదు చేసుకున్నారు. దీంతో ఈసారి కూడా రంగారెడ్డి జిల్లా అనేది కీలకంగా మారనున్నది.

 

 

Other News

Comments are closed.