పండగ ముందు పందెం కోళ్లను అరికట్టగలరా? 

share on facebook

కోనసీమ వాసులను ఎవరిని అడిగినా కోడిపందెం లేనిదే సంక్రాంతి లేదంటారు. కోడిపందాల మజా అంటేనే పండగ అంటారు. తమిళనాడు వాసులకు జల్లికట్టు కూడా అలాంటిదే. గతేడాది జల్లికట్టుకు సంబంధించి ఎంత రాద్దాంతం జరిగిందో ప్రజలు మరచిపోయి ఉండరు. ఏటా సంక్రాంతి పండగకు ముందు కోడిపందాల పై వివాదం చెలరేగుతూనే ఉంది. తమిళనాట జల్లికట్టు…మనదగ్గర కోడిపందాలు వివాదం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ యేడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.  కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ విషయమై 2016 డిసెంబర్‌ 26న జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. మరి ఈ ఏడాది హైకోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేస్తారన్నదే ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఏటా కోడి పందేలు ఒక మెగా ఈవెంట్‌ లా మారిపోతున్నాయి. పందేలు నిర్వహిస్తున్న ప్రాంగణం అంతా బస్సులు, కార్లతో నిండిపోవడం చూస్తే, ఎంత పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఈ తతంగం అంతా మేం గమనిస్తున్నాం అని న్యాయమూర్తులు చేసి వ్యాఖ్యలను గమనిస్తే పెద్ద ఎత్తున కోడిపందాల నిర్వహిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రాంతాలపై అధికారులు దాడులు చేసి రూ.9.72 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొనడం పట్ల ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోడిపందేలను అడ్డుకోవడంలో విఫలమైన 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్‌హెచ్‌వోలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసినట్లు తెలపగా, వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విూ చిత్తశుద్ధిని పరీక్షించబోతున్నాం. ఈ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదు. ఈ విషయంలో విఫలమైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని  కూడా తేల్చి చెప్పింది. కోడిపందేల నిర్వహణ కుదరదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఏటా ఆయన సుప్రీంకు వెళ్లడం తాత్కాలిక ఆదేశాలు తెచ్చుకోవడం, ఏటా పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బరులు లేకుండా కత్తి కట్టకుండా పందాలు నిర్వహించు కుంటే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. అలాగే పందాలతో పార్టీకి చెడ్డపేరు తేవద్దని కూడా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇదంతా మామూలే అన్న ధరోణిలో ఛోటామోటా నేతలు ఉన్నారు. అందుకే సంక్రాంతి కోడి కోసం ఎవరి ఏర్పాట్లలో వారున్నారు. ఎవరికి వారు సర్దుకు చెప్పుకుని పందెం కోళ్లను రెడీ చేస్తున్నారు. అందుకే సంక్రాంతి పందెం కోడి కూయబోతోంది. ఈ ఏడాది కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం సంక్రాంతికి జరుగుతున్న కోడి పందేలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి నుంచే నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముందస్తు అరెస్టులు చేస్తుమంటున్నారు. పందాలు నిర్వహించవద్దంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కోడి పందేల నిర్వాహకులు మాత్రం ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ వీటి నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా డెల్టా, మెట్ట ప్రాంతాల్లోని నిర్వాహకులు పైరవీలు ప్రారంభించారు.  సంక్రాంతి పండగ సందర్భగా జరిగే కోడిపందాలకు పశ్చిమ పెట్టింది పేరు. ఇక్కడ ఎన్ని అవాంతరాలు ఉన్నా పందాలు జరిగి తీరాల్సిందే అన్న రీతిలో సాగుతున్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నా, పోలీసుల నిఘా పెరిగినా బరులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బరులను సిద్ధం చేస్తున్నారు.ఓ పక్క పోలీసు యంత్రాంగం హెచ్చరికలు చేస్తున్నా.. మరోపక్క నిర్వాహకులు బహిరంగం గానే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరోవైపు పందేలు నిర్వహించొద్దంటూ పోలీసులు హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేశారు.  సంక్రాంతి మూడు రోజులు 13 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో లాడ్జిలు నిండిపోతాయి. గతేడాది కోడిపందాలు నిలువరించేందుకు భోగి పండుగ రోజు ఉదయం 11 గంటల వరకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా చివరకు రాజకీయ నాయకుల ప్రభావం ముందు నిలవలేక చేతులెత్తేశారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతుందనే ప్రయత్నాల్లో పందెం రాయుళ్లు ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా కోళ్లను పెంచి వాటికి ప్రత్యేక తర్ఫీదునిస్తున్నారు. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడిపందేలు నిర్వహించే ప్రాంతాల్లో కోడి పందేలు లేకపోతే పండగ సరదా ఏముంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా భోగి రోజు మాత్రం కోడికి కత్తి కట్టాల్సిందే.  ఆంక్షల నేపథ్యంలో రహస్యంగా బరికట్టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఇతర జిల్లాల నుంచి వచ్చే పందేగాళ్లకు తగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని తెలుస్తోంది. ఆయాచోట్ల కూడా బరులు నేటికీ సిద్ధం కాలేదు. ఆరగట్టిన చేపల చెరువులను పందేలకు వేదికలుగా మార్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పందేలు నిర్వహణకు కొందరు ఇప్పటి నుంచి సిండికేట్‌గా ఏర్పడి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కోడిపందేల సంస్కృతికి ఉన్న ప్రాంతాల్లో సంప్రదాయం మాటున పందేలును జూదంగా మార్చి రూ. లక్షలు వెనుకేసుకునేందుకు మంతనాలు సాగుతున్నాయి. రాజకీయ నేతల అండదండలతో నియోజకవర్గం వ్యాప్తంగా మండలాల్లోని పలు గ్రామాల్లో కోడిపందేలు ఆడించేం దుకు స్థానిక నాయకులు వేగంగా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టు ఆదేవాల మేరకు ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.

Other News

Comments are closed.