పక్కాగా ఎన్నికల ఓట్ల లెక్కింపు

share on facebook

సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు
కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు.  కౌంటింగ్‌ రోజు సిబ్బంది మొత్తం ఉదయం 5 గంటల వరకే తమ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరిచే సమయానికి సిద్దంగా ఉండాలన్నారు. ఏ నియోజకవర్గం ఏ టేబుల్‌ కేటాయిస్తారో ముందుగానే తెలియ జేయాలని, ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా తమ టేబుల్‌పైకి వచ్చిన సీయూలో ఏవైనా సాంకేతిక సమస్యలున్నట్లతే వెంటనే ఏఆర్వో దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గానికీ 5 పోలింగ్‌ స్టేషన్ల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించాలని, ఎ న్నికల కమిషన్‌ ఆదేశాలను తూ.చ తప్పక పాటించాలని సూచించారు.  పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌కు విస్తృత ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ సందర్శించి ఏ ర్పాట్లను పరిశీలించారు.  కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూర్‌, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, సిరిసిల్ల, వేములవాడ సెగ్మెంట్ల పరిధిలో ఓట్ల లెక్కింపు పక్రియకు అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు వెళ్లేందుకు ప్రత్యేక దారులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బార్‌గేటింగ్‌ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గం కౌంటింగ్‌ హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ సందర్భంగా విధులను నిర్వహించే సిబ్బందికి డ్యూటీ పాసులను జారీ చేయాలని వివరించారు. ఉదయం 8.00 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును ముగించాలని, 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

Other News

Comments are closed.