పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్‌..

share on facebook

– ఇళ్లలోకి చేరిన నీరు
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామస్తులు
కామారెడ్డి, జులై27(జ‌నంసాక్షి) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ తండాలో శుక్రవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. పైప్‌లైన్‌ నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగిసిపడి ఏరులై పారింది. ఇళ్లు, పంటపొలాల్లోకి నీరు చేరి వరదను తలపించింది. మోకాళ్లు లోతు నీరు నిలిచిపోవడంతో గ్రామాస్థులు ఇబ్బందులు పడ్డారు. భారీగా నీరు చేరడంతో ఇళ్లలో, బియ్యం, బట్టలు, ఎరువులు, సర్టిఫికెట్లు, నగదు నీళ్లలో తడిచిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు సమాచారం ఇచ్చినా గంటన్నర తర్వాత వచ్చారని వాపోయారు. మిషన్‌ భగీరథ పనుల్లో నాణ్యతాలోపం కారణంగా పైపులు పదేపదే లీకు అవుతున్నాయని గ్రామస్థులు మండిపడ్డారు. పైప్‌లైన్‌ వద్దకు చేరుకున్న సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఇదిలా ఉంటే పలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లానీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం పథకాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా గ్రామ, గ్రామాన ప్రధాన రహదారుల వెంట పైపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో నాసికరంగా పనులు నిర్వహించడం వల్ల పైపులు లీకై ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైపులీకై ఇళ్లు, పంట పొలాల్లోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి వద్ద పైపులీకై గ్రామం జలమయమైంది. ఇప్పటికైన అధికారులు స్పందించి పైపులు లీకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Other News

Comments are closed.