పత్తిరైతులకు పక్కలో బల్లెంలా దళారులు

share on facebook

సిసిఐ కొనుగోళ్లు కూడా అంతంత మాత్రమే

ఆశలు పెట్టిన తెల్లబంగారంతో నష్టపోతున్న రైతులు

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి రైతాంగానికి దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ

కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ మద్దతు ధర మొదలుకొని నాణ్యతా ప్రమాణాల వరకు కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తుండడంతో మారుమూల గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పింజ పొడవు, తేమ శాతం విషయంలో కొద్దిగా తేడా ఉన్నా తిరస్కరిస్తుండడంతో రైతులు తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారు. ఫలితంగా మద్దతు ధర విషయంలో ఒక్కో క్వింటాపై రూ.1000 నుంచి రూ. 1200 నష్టపోతున్నారు. సీసీఐ తేమ శాతం 8నుంచి 12 శాతం లోపు ఉంటేనే రైతుల పట్టాదారు పుస్తకాల ఆధారంగా సంబంధిత మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే ధ్రువీకరణతో మాత్రమే రూ.5,775 ధర చెల్లిస్తున్నారు. అయితే జిల్లాలో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉండగా ఇలాంటి వారి నుంచి పత్తి కొనుగోలు చేయాలంటే భూమి యాజమాన్య హక్కులు కావాలని అడుగుతుండడంతో కౌలు రైతులు దిక్కు తోచని స్థితిలో ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరలకు పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌ పత్తికి రూ.4,600 నుంచి రూ.5000 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వింటాలు పత్తికి రూ.5,825 మద్దతు ధర ఇవ్వాలి. కానీ దారం పొడవు తక్కువగా వస్తుందన్న నెపంతో మద్దదు ధరలో రూ.50 కోత విధించి క్వింటాల్‌కు రూ.5,775 చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ధరల విషయంలో సీసీఐ ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని చెబుతున్నా పాయింట్‌ పాయింట్‌కు మధ్య మద్దతు ధరల తేడాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇక ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్న ధర మరీ దారుణంగా ఉందంటున్నారు. దాంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఆరంభంలో ఆశలు రేకెత్తించిన తెల్ల బంగారం వరుస వర్షాల దెబ్బకు రైతాంగం పుట్టి ముంచింది. పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తున్న జిల్లా రైతాంగానికి ప్రస్తుతం వస్తున్న దిగుబడి, మార్కెట్లో లభిస్తున్న మద్దతు ధర గుండె గుబేలుమనిసిస్తోంది. వర్షాలకు నాణ్యత దెబ్బతింది, ఫలితంగా మొదటి విడతపై రైతాంగం ఆశలు వదులుకున్నా రెండో విడత సేకరణలోనైనా ఆశించిన దిగుబడి వస్తుందని ఎదురుచూశారు. కానీ గులాబి పురుగు రూపంలో వారి ఆశలు అడుగంటాయి. దాంతో ఈ ఏడాది పత్తి రైతాంగానికి దిగుబడుల రూపంలో మొదటి పిడుగు పడగా ప్రస్తుతం మద్దతు ధర నిరాశ పరిచింది. గత ఏడాది ఒక్కో ఎకరాకు 6నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది 2-3 క్వింటాళ్లకు తగ్గిపోయింది. మొదటి కాపు బాగానే వచ్చినప్పటికీ వర్షాల వల్ల దెబ్బతినగా నవంబరు, డిసెంబరు మాసాల్లో వచ్చే రెండో విడతలోనే అధిక దిగుబడులు రావాల్సి ఉంది. అయితే ఈసారి అక్టోబరు చివరి వారం నుంచే చలి పెరిగి మంచు కురుస్తుండడంతో గులాబి రంగు పురుగు బెడద పెరిగిపోయిందని, దిగుబడి వచ్చినా నాణ్యతపై ప్రభావం కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. దాంతో సీసీఐ ఇలాంటి పత్తిని కొనుగోలు చేసేందుకు నానా కొర్రీలు పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Other News

Comments are closed.