పత్తి రైతులకు ఏటా కష్టాలే

share on facebook

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పత్తి దిగుబడులు మార్కెటుకు వస్తున్న కొద్దీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మద్దతు ధరలను పతనం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో సరైన దిగుబడులు రాకపోవడంతో నిరుత్సాహపడ్డారు. ఈ ఏడాది వానలు కొంత ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులు

ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అనుకునేలోపే అన్నదాత ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రతీ సీజన్‌లోనూ వ్యాపారులు తేమ పేరుతో రైతన్నలను దోపిడీకి గురిచేస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తి తేమ 8 శాతానికి మించకూడదు. 8 నుంచి 12 శాతం ఉంటే మద్దతు ధరపై ప్రతి శాతానికి

రూ.41 కోత విధిస్తారు. 12 శాతానికి మించితే ఆ పంటను కొనుగోలు చేయరు. దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు రైతులను తేమ పేరుతో నిండా ముంచుతున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తేమ శాతం 12వరకున్నా మద్దతు ధరపై కోతలు లేకుండా కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా వరకు సీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. దాదాపు మూడు జిల్లాల వ్యాప్తంగా 5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అన్నదాతలు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవరకు వేచి చూడకుండా ప్రైవేటు వ్యాపారుల వద్ద అమ్మడానికే మొగ్గుచూపుతున్నారు.ప్రైవేటు వ్యాపారులు నాణ్యత బాగుంటే రైతుల నుంచి ఎక్కువ ధరకైనా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెటులోనే పత్తికి మంచి గిరాకీ ఉండటంతో అన్నదాతలందరూ ప్రైవేటుగానే తమ పంటను విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయకపోవడానికి ఇదీ ఒక కారణమని తెలుస్తోంది.

Other News

Comments are closed.