పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

share on facebook

– తెరాసలో చేర్చుకోనందుకే కోమటిరెడ్డి ఆందోళనలు

– కోమటిరెడ్డి కోతిచేష్టలను రైతులు నమ్మొద్దు

– రేవంత్‌ను చూసి కోమటిరెడ్డి భయపడుతున్నాడు

– ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని, రైతులకు ఏ కష్టమొచ్చినా సీఎం కేసీఆర్‌ వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. నల్లగొండలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. రాజకీయ ఉనికి కోసమే ఛలోఅసెంబ్లీ పేరుతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పత్తికి కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనన్నారు. అందుకే పత్తి రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.50వేలు పరిహారం ఇస్తానన్న కోమటిరెడ్డి ఒక్కరికి ఇచ్చి మొఖం చాటేశాడన్నారు. ఇటీవల తెరాసలో చేరేందుకు ప్రయత్నించగా కోతి చేష్టలు చేసేవారు మన పార్టీలో ఉండలేరని ముఖ్యమంత్రి తిరస్కరించారని ఆ కోపంతోనే కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలతో ఉనికి కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో 59ఐకేపీ సెంటర్లు, 18 పత్తి కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించామని సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి వస్తే తన ఉనికి తగ్గిపోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భయపడుతున్నారని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్‌ను బీట్‌ చేయడానికి, రాజకీయ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి చలో అసెంబ్లీ అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారన్నారు. ఆయన కోతి చేష్టలను రైతులు నమ్మొద్దని సుఖేందర్‌రెడ్డి కోరారు. కాగా పత్తి రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 27న తలపెట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘పోరాడితే పోయేదేవిూ లేదు బానిస సంకెళ్లు’ తప్పా అనే స్ఫూర్తితో రైతుల తరఫున తానే ముందుండి పోరాడుతానని కోమటిరెడ్డి సోమవారం తెలిపారు. భవిష్యత్‌లో ఎంపీ, ఎమ్మెల్యే ఏదీ కాకున్నా రైతుల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానన్నారు.

Other News

Comments are closed.