పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నా

share on facebook

– ఆదేశ ప్రధానితో త్వరలోనే సమావేశమవుతా
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
వాషింగ్టన్‌, జనవరి3(జ‌నంసాక్షి) : పాకిస్థాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో త్వరలోనే సమావేశమవుతానని, పాక్‌తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ తన క్యాబినెట్‌ సహచరులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో ఆయన పాకిస్థాన్‌కు 1.3బిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాము పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, కానీ వారుమాత్రం శత్రువులకు ఆశ్రయమిస్తున్నారని అన్నారు. పాక్‌ దేశాధినేతను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. తమ యంత్రాంగం తాలిబన్లతో శాంతిచర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. ఒకవేళ పాకిస్థాన్‌ తాలిబన్లను చర్చలకు తీసుకురాగలిగితే.. అమెరికా ఉగ్రవాద నిర్మూలన, ఇస్లామిక్‌ స్టేట్‌పై దృష్టి పెడుతుందని ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే దక్షిణ కరొలినా సెనేటర్‌ లిండ్సే గ్రహామ్‌ ‘సీఎన్‌ఎన్‌’కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అఫ్గాన్‌ యుద్ధాన్ని ముగించేందుకు తాలిబన్లను శాంతి చర్చలకు వచ్చేలా చేసేందుకు అమెరికాకు పాక్‌ సహకరించాలని మరో రిపబ్లికన్‌ సెనేటర్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ అమెరికాకు అనుకూలంగా ఉండడం లేదని ట్రంప్‌ అంటున్న సంగతి తెలిసిందే. ‘మేము పాకిస్థాన్‌తో గొప్ప సంబంధాలు కోరుకుంటున్నామని, కానీ వాళ్లు శత్రువులకు ఆశ్రయమిస్తున్నారన్నారు. శత్రువులను కాపాడుతున్నారని, మేము అలా చేయలేమని ట్రంప్‌ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబరులోనే అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో ఇమ్రాన్‌ఖాన్‌ను కలిశారు. అఫ్ఘాన్‌లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని కోరుతూ గత నెలలో ట్రంప్‌.. ఖాన్‌కు లేఖ రాశారు.

Other News

Comments are closed.