పాఠశాల స్థాయిలోనే పర్యావరణ బోధన సాగాలి

share on facebook

పాఠశాల స్థాయిలో పిల్లల్లో సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశాలను బోధించాలి. మనకు సవాల్‌గా మారిన పర్యావరణ సమస్యలను అధిగమించేలా పాఠాలను తయారు చేసుకోవాలి. మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలను పిల్లల్లో అవగాహన కలిగించాలి. అప్పుడే వారికి పెద్దయ్యాక వాటిపై మరింత అవగాహన పెరుగుతుంది. మొక్కై వంగనిది మానైనా వంగదన్న రీతిలో పిల్లలకు చిన్నప్పుడే నీతి బోధన జరగాలి. ఇది సమాజంలో మంచికి దోహదపడగలదు. తెలంగాణలో హరితహారం, ఆంధ్రాలో వనంమనం కార్యక్రమాలను పెద్దెత్తున చేపడుతున్న వేళ పాఠశాల విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలనుకోవడం ముదావహం. పిల్లలకు మొక్కల పెంపకం తప్పనిరి చేయాలి. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను బోధించాలి. తెలంగాణ విద్యాసంస్థల్లో రెండు కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం విప్లవాత్మక నిర్ణయంగా చెప్పుకోవాలి. ఈ లెక్కలు కేవలం కాగితాలపై లెక్కలకు పరిమితం చేయవద్దని, మంచి ఫలితాలు వచ్చేవిధంగా పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇచ్చిన ఆదేశాలు విద్యాశాఖ తూచా తప్పకుండా పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో 40 లక్షల మంది విద్యార్థులున్నారని, వారిలో 25 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 చొప్పున పండ్ల మొక్కలు ఇచ్చి వాళ్ల ఇంటి ఆవరణలో నాటేవిధంగా ప్రోత్సహిం చాలని సూచించారు. దానివల్ల 1.25 కోట్ల మొక్కలు అవుతాయన్నారు. విద్యా సంస్థల్లో పర్యావరణంపై అవగాహన పెంచి.. హరితహారాన్ని విజయవంతం చేయటంలో భాగంగా గ్రీన్‌ బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. అడవులు అంతరించి పోవడం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇకనైనా ప్రజలంతా సమాయత్తంకావాలి. రుతుపవనాలు ప్రవేశించి నెల దాటినా గట్టి వర్షం కురవలేదు. భూతాపం, పర్యావరణ విధ్వంసం కారణంగా మనం అనేక ప్రతికూల పరిస్థితులను చూస్తున్నాం. ఇప్పటి కైనా మేల్కోక పోతే భవిష్యత్‌ మరింత దారనుణంగా ఉండగలదు. అందుకు రేపటి తరం మనలను నిందిస్తూ కూర్చోగలదు. దానిని అధిగమించేందుకు ఇప్పటి నుంచే మొక్కల పెంపకాన్ని, ప్లాస్టిక్‌ నిషేధాన్ని యుద్దప్రాతిపదికన చేపట్టాలి. ఇది ఒకరోజుకో, రెండురోజులో కాకుండా ఇకమనం బతికినంత కాలం నిరంతరాయంగా సాగించాలి. ఇలా ఓ శతాబ్దం పాటు సాగితే అప్పుడేమైనా మనకు సత్ఫలితం రావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. హరితతెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని గత మూడేళ్లుగా చేపట్టారు. హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటి కొంతమేర ఫలితాన్ని సాధించినా, లక్ష్యాన్ని ముద్దాడే దిశలో ప్రభుత్వానికి తోడుగా ప్రజలు నిలవాలి. తాజాగా ప్రతీ గ్రామంలో కనీసం 40 వేల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించు కుంది. అందుకు అనువైన వ్యవస్థ లేకపోవడంతో లక్ష్యాన్ని చేరలేక పోతున్నామన్న కారణంతో మండల స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న ఒకటి, రెండు నర్సరీల్లో ఉత్పత్తయ్యే మొక్కలూ లక్ష్యానికి అనుగుణంగా సరిపడడం లేదనే వాదన ఉంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణ ప్రారంభించింది. గ్రామగ్రామన నర్సరీ పథకం దీర్ఘకాలికంగా నిరంతర పక్రియగా అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇక వచ్చే ఏడాది హరితహారం నుంచి నర్సరీల్లో మొక్కలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఆ పథకం రూపొందించి ఇప్పుటి నుంచే కార్యాచరణ అమలును ప్రారంభించింది. ఈ నిరంతర పక్రియలో మొక్కలు పెరిగి పదేళ్లలో రాష్ట్రంలో ఊహించని విధంగా మొక్కలు పెరిగేలా చేస్తారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018లో హరితహారం అమలు, పోషణ బాధ్యతనగ్రామపంచాయతీలకు అప్పగించగా, అవకతవకలు జరిగితే సర్పంచ్‌, కార్యదర్శి, ఈవోఆర్డీలను బాధ్యులు గా చేసి వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ నర్సరీల సంరక్షణ, మొక్కల పోషణ, పెంపకం స్థానిక పంచాయతీకి అప్పగించడం వల్ల వాటి నిర్వహణ సులువు కానుంది. గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉంటే ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే రైతు నుంచి భూమిని లీజుకు తీసుకుని నర్సరీ ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక నర్సరీ స్థలంలో భూసార, నీటి పరీక్షలు నిర్వహించి అనువైతేనే ఏర్పాటు చేస్తారు. సీజన్‌లోపు ఈ నర్సరీలో మొక్కలు నాటేందుకు అనువుగా పెరిగేలా చూస్తారు. కాగా ఈ నర్సరీలో మొక్కలు వానాకాలం సీజన్‌లోనే కాక సంవత్సరాంతం లభ్యమయేలా ఏర్పాటు ఉంటుంది. నాటిన మొక్కలు ఎండకుండా వాటర్‌ట్యాంకర్‌ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఓ రకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లే. ఇలా అందుబాటులో ఉన్న మొక్కలను నాటి సంరక్షించుకునే బాధ్యత ప్రజలదే. ప్రజలు ఈ కార్యక్రమాన్ని తమదిగా భావిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. ప్రజల్లో పోటీతత్వం రావాలి. నా మొక్కలు అన్న భావన ఏర్పడాలి. మన భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలన్న ఆలోచన రావాలి. డబ్బు ఎంతకూడపెట్టినా వాతావరణం సరిగా లేకుంటే రోగాల బారిన పడగలం. రోగాల బారిన పడకుండా ఉండాలంటే దేశంలో మనం ఎక్కడున్నా మొక్కలు నాటడం, వాటిని పెంచడం అన్న అలవాటు ను నిత్యకృత్యం చేసుకోవాలి. అప్పుడే దేశం బాగుపడగలదు. పొగొట్టుకున్న పచ్చదనాన్ని కొంతయినా పొందగలం. పర్యావరణాన్ని పరిరక్షించుకోగలం. ఇదే సందేశంతో ప్రజలు దేశంలో ఉద్యమిస్తేనే వాతావరణ కాలష్యం నుంచి బయటపడగలమని గుర్తెరగాలి.

 

Other News

Comments are closed.