పాతపద్దతిలో ఉమ్మడి జిల్లాగా సహకార ఎన్నికలు

share on facebook

కసరత్తులో అధికారుల బిజీ
కామారెడ్డి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు పాత పద్దతిలోనే జరుగనున్నాయి. మొదటగా పీఏసీఎస్‌ పరిధిలో ప్రత్యక్ష ఓటింగ్‌ నిర్వహించనున్నారు. తర్వాత సంఘాలకు చైర్మన్లను, డైరెక్టర్లు చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గం నుంచి నిబంధనల మేరకు ఉన్న డీసీసీబీ డైరెక్టర్లను పరోక్ష పద్ధతి లో ఎన్నుకుని తర్వాత డీసీసీబీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిని కలిపి ఒకే డీసీసీబీ పాలకవర్గం ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.  కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కాకుండా ఉమ్మడి జిల్లాగానే డీసీసీబీ పాలకవర్గం ఉండేలా ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో దాదాపుగా 3లక్షల మంది సభ్యులుండగా రెండున్నర లక్షల మంది ఓటర్లున్నట్లుగా సమాచారం.ఇప్పటికిప్పుడు జిల్లాల వారీగా సహకార ఎన్నికలు నిర్వహించినా డీసీసీబీ పాలకవర్గాల విషయానికి వచ్చే సరికి ఆలస్యం కావడంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంటుంది. కామారెడ్డి జిల్లాలోని 55 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నిర్వహించనున్న ఎన్నికల్లో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, కొత్తగా పీఏసీఎస్‌లలో సభ్యులుగా చేరిన వారికి ఓటు వేసేందుకు, పోటీ చేసేందుకు అవకాశం లేదు. 2017, డిసెంబర్‌ 31వ తేదీలోపు సంఘాల్లో రూ.300 రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకున్న రైతులు మాత్రమే ఓటు హక్కుకు అర్హత కలిగి ఉంటారని అధికారులు చెబుతున్నారు. సంఘాల్లో సభ్యుడిగా చేరేందుకు
వ్యవసాయ భూమి తప్పని సరిగా ఉండాలి. ఎలాంటి అప్పులు ఉం డకూడదనే నిబంధనలు జారీ చేశారు.
జిల్లాలో 55 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు గాను 1,44,689 మంది సభ్యులున్నారు. ఇందులోనూ ఎంత మంది క్యాపిటల్‌ షేర్‌ కట్టి ఉన్నారనేది క్షేత్ర స్థాయిలో విచారించి తుది ఓటరు జాబితాను ఈ నెల 31వ తేదీ నాటికి ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ప్రకటించిన వివరాల మేరకు 92,955 మంది ఓటర్లున్నట్లుగా తేలింది.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 142 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఓటరు జాబితా సవరణకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తే చేసింది. 21వ తేదీ నాటికి అభ్యంతరాలను స్వీకరించింది.

Other News

Comments are closed.