పివికి కాంగ్రెస్‌ బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి

share on facebook

ఒక్క కారణం చాలు..తెలుగు వారంతా కాంగ్రెస్‌ను జట్టుకట్టి ఓడించడానికి.. తెలుగువారిని అవమానించిన కాంగ్రెస్‌ను మట్టి కరిపించడానికి…మళ్లీ తెలుగునేలపై వారికి నూకలు చెల్లేలా చేయడానికి పివి ఉదంతం ఒక్కటి చాలు..ఏదో ఓ కారణంతో ఎపి ప్రజలు కాంగ్రెస్‌ను మట్టి కరిపించాయి. దానిని దూరంగా పెట్టాయి. గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు రాకుండా గట్టిగా బుద్ది చెప్పాయి. ఇక ఇప్పుడు తెలంగాణ చేయాల్సి ఉంది. పివిని ఆనాడు అవమానించినందుకు కర్రుకాల్చి వాత పెట్టాలి. కాంగ్రెస్‌ అంటే ఛీత్కరించుకునేలా చేయాలి. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, ఈ దేశ ప్రతిష్టను ప్రపంచంలో నిలిపిన మహామేధావి స్వర్గీయ పివి నరసింహారావు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాజ్‌పేయ్‌ ప్రతిభను గుర్తించి ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపి భారత వాణిని వినిపించేలా చేసన ఘనుడు దివంగత పివి. మన్మోహన్‌ను తీసుకుని వచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. కానీ జరిగిందేమిటి? పివికి కాంగ్రెస్‌ చేసిన అవమానమేంటి? ఇది ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయ్‌ మరణంతో ఆయనకు దేశం ఎలాంటి నివాళి ర్పించిందో పివికి కూడా అలాంటి గౌరవమే దక్కాల్సి ఉండగా ఆలా జరగలేదు. అధికారంలో కాంగ్రెస్‌ ఉన్నా, మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నా..సోనియా తీరు కారణంగా ఓ భారతముద్దుబిడ్డకు అవమానం జరిగింది. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో చర్చగా మారింది. తెలుగునాట ఇదే ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంతేనా అంటే కాంగ్రెస్‌ను చంద్రబాబు వెనకేసుకుని రావడమేంటన్న ఆదన కూడా చేస్తున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీని పెట్టి దానిని కూకటివేళ్లతో ఎన్టీఆర్‌ పెరికేస్తే..ఇప్పుడు చంద్రబాబు దాని అంట కాగడమేంటని అంటున్నారు. యావత్‌ బీజేపీ శ్రేణులు వాజపేయికి సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఆనాడు ఎందుకీ అవమానం జరిగిందన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ, ప్రధానిగా భారత కీర్తిని ప్రపంచానికి చాటినా, ఇందిర, రాజీవ్‌లకు నమ్మిన బంటుగా ఉన్నా…ఎందుకీ అవమానం అన్నది నిజంగానే ఆలోచన చేయాల్సిన సమయమిది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు. 2004, డిసెంబర్‌ 23న తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(83) కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌కు అసమాన సేవలందించిన తెలుగుతేజానికి అంతిమ కాలంలో జరిగిన అవమానాలు అన్నీఇన్నీ కావు. పీవీ పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం లోకి రానీయని పరిస్థితి. మొక్కుబడిగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాళులు అర్పించి.. వెంటనే భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించాలంటూ కుటుంబసభ్యులపై ఒత్తిడిచేశారు. పీవీకి ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, స్మారకాన్ని నిర్మించాలంటూ ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు తెగేసి చెప్పారు. కానీ, సోనియా ఆంతరంగికులు చక్రం తిప్పి బలవంతం గా పీవీ పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. పీవీకి నెక్లెస్‌ రోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రకు గాంధీ కుటుంబసభ్యులెవరూ హాజరుకాలేదు. దేశ చరిత్రలో ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించని, స్మారకాన్ని ఏర్పాటుచేయని పరిస్థితి ఒక్క పీవీకే ఎదురైంది.ఈ ఒక్క కారణంతో అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి. ఎక్కడిక్కడే ఎందుకు ఇలా చేశారో సంజాయిషీ అడగాలి. ఆలస్యంగా అయినా మేల్కోవాలి. రాహుల్‌ భజనబృందాన్ని గ్రామాల్లో నిలదీయాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. నెటిజన్ల ప్రశ్నల్లో న్యాయం ఉంది. వాజ్‌పేయ్‌ నిజంగానే

గొప్పవాడు. అందుకే బిజెపి శ్రేణులు స్పందించినట్లుగా ఇటలీ బృందం స్పందించలేదు. మాజీ ప్రధాని వాజపేయికి బీజేపీ ఘనంగా నివాళులు అర్పించడమే కాదు..ఆయన స్థానానికి తగ్గటుగా గౌరవాన్ని ఇచ్చింది. ఎంతగా అంటే ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర రాష్ట్రాల సిఎంలు ఆయన అంతిమయాత్రలో వెన్నంటి నడిచారు. పార్టీ కార్యాలయంలో అంజలి ఘటించిన అనంతరం అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ కాలినడకన ముందు నడుస్తూ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ విూడియా ఈ చివరియాత్రను నాటి ప్రధాని పీవీ చరమాంకంలో జరిగిన సంఘటనలను పోలుస్తూ సోషల్‌విూడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అటల్‌జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం చేస్తున్నదని వ్యాఖ్యానించారు. కానీ, దివంగత మాజీ ప్రధాని పీవీ విషయంలో కాంగ్రెస్‌ ఇప్పటివరకూ ప్రాయశ్చితం చేసుకోలేకపోయింది. భారత్‌కు చెందిన గొప్ప ప్రధానుల జాబితాలో అటల్‌జీకి తగిన గౌరవం దక్కింది అంటూ వ్యాఖ్యానించారు. వాజపేయి అంత్యక్రియల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మోదీ పశ్చాత్తాపం వ్యక్తంచేశారంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌కే ధావన్‌ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించి సోనియా, రాహుల్‌తో సహా అగ్రనేతలందరూ క్యూ కట్టి నివాళులర్పించారు. ఈ సంఘటనపై ఇటీవల సోషల్‌విూడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ప్రధాని పీవీ భౌతికకాయాన్ని నాడు కనీసం పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కనివ్వలేదంటూ మండిపడ్డారు. ధావన్‌ను గౌరవించి, పీవీని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమాలు చురకుగా ఉన్న ప్రస్తుత పరిస్తితుల్లో నిజాలను దాచలేం. అవమానాలను భరించలేరు. కాంగ్రెస్‌ ఇప్పటికైనా పాశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలి. లేకుంటే ప్రజలు క్షమించరు.

—————

 

Other News

Comments are closed.