పెనుతుపానుగా మారిన ‘ఓఖి’

share on facebook

– తమిళనాడు, కేరళకు అతిభారీ వర్ష సూచన

– అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు

చెన్నై,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘ఓఖి’ తుపాను పెనుతుపానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ప్రస్తుతం మినికాయ్‌ దీవులకు 110 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. 17 కిలోవిూటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింత తీవ్రతరంగా మారే సూచనలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 4వరకు పెనుతుపానుగా కొనసాగనున్నట్లు చెబుతున్నారు. ఓఖి’ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 100-110 కిలోవిూటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల్లో కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో 20 సెం.విూల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. పెనుగాలుల వల్ల చెట్లు, సెల్‌టవర్లు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శబరిమల వెళ్లే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని తుఫాను ప్రభావిత రాష్టాల్రు హెచ్చరికలు జారీచేశాయి. కాగా తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంది.

ఎనిమిది మంది మృతి..

తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్టాల్లో 8మంది మృతిచెందారు. తమిళనాడులోని కన్యాకుమారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, రామనాథపురం, పుదుకోట్లై, తిరుచ్చి జిల్లాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం తమిళనాడులోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మత్య్సకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంతో పాటు పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Other News

Comments are closed.