పెళ్లి ఖర్చులు చెప్పాల్సిందే

share on facebook

– వివరాలు వెల్లడించేలా నిబంధనలు రూపొందించండి
– కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : వివాహ సమయంలో పెట్టే ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు సంయుక్తంగా ఖర్చు వివరాలను వివాహ ధ్రువీకరణ అధికారి వద్ద నమోదు చేసేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా వరకట్న దురాచారాన్ని రూపుమాపడంతో పాటు, వరకట్న నిషేధ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులను నివారించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. వివాహ సమయంలో చేసే ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్‌ చేయడం ద్వారా వారి భవిష్యత్‌కు భరోసా కల్పించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికనుగుణంగా ఇంతకు ముందున్న చట్టాల్లో సవరణలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వివాహ సమయంలో వధూవరుల తరఫున ఎంత ఖర్చయిందన్న విషయాన్ని సబ్‌ రిజిస్ట్రా/-కు సమర్పించాల్సిందేనన్న కేంద్రం నిర్ణయాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేసింది.

Other News

Comments are closed.