పోయి..మళ్లీ ఓటేసేందుకు రండి

share on facebook

 

 

 

 

సంక్రాంతికి వచ్చిన వారిని సాగనంపిన అభ్యర్థులు

పంచాయితీ ఎన్నికల కోసం అభ్యర్థుల వేడుకోలు

ఎన్నికల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సంక్రాంతి పండగ ముగిసినా పంచాయితీ పండగ మిగిలే ఉంది. పండగకోసం ఊళ్లకు వచ్చిన జనం తరలిపోయారు. అయినా మళ్లీ రావాలంటే అందరికి పేరుపేరునా ఆహ్వానాలు అందించారు. 21న జరిగే పంచాయితీ ఎన్నికలు మొదలు మూడు విడతల్లో జరిగే పంచాయితీలకు గ్రామాలు విడిచి వెలల్‌ఇన వారంతా తిరిగి రావాలని అభ్యర్థించారు. గ్రామాలు, తండాల నుంచి ఉపాధి, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లపై నాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే బరిలో ఉండే అభ్యర్థుల అనుచరులు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. ఈనెల 21న పోలింగ్‌ రోజుకు ముందుగానే సెలవు పెట్టుకొని రావాలని కోరుతున్నారు. వారి ఓట్లు ప్రతి పంచాయతీ నుంచి దాదాపుగా 30 నుంచి వందకు పైగానే ఉన్నాయి. వారి నిర్ణయం గెలుపోటముల పైన స్పష్టమైన ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. పంచాయతీల్లో వలస ఓటర్లు చాలా మంది ఉన్నారు. వారి రాకతో పదవీ ఎవరిని వరిస్తుందోనని వేచి

చూస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు రావడానికి అయ్యే రాను పోను ఖర్చులు అవసరమైతే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడానికి కొందరు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. చదువుకునేందుకు యువత, ప్రైవేటు ఉద్యోగులు, కూలీ పనుల నిమిత్తం వెళ్లిన వారంతా నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, సూరత్‌, ముంబయి పట్టణాల్లో ఉంటున్నారు. ఓటు హక్కు వినియోగించు కునేందుకు ప్రతిసారి స్వగ్రామాలకు వస్తుంటారు. వాస్తవానికి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 50 శాతం కూడా బయట ఓటర్లు గ్రామాలకు రాలేదు. ఈసారి స్థానిక వ్యక్తులు పోటీలో ఉండటంతో ప్రతి ఓటు పైన అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇకపోతే జిల్లాలో మొదటి, రెండో విడతతో పాటు మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని కలెక్టర్‌ కామారెడ్డి సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ మేరకు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తున్నామని, మొదటి, రెండో విడతల నామినేషన్‌ పత్రాల స్వీకరణ పూర్తయిందని తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 164 గ్రామ పంచాయతీలకు, 1,508 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… 31 పంచాయతీలు, 452 వార్డులు ఏకగ్రీవమైనట్లు వెల్లడించారు. రెండో విడతలో 192 పంచాయతీలకు గాను 1,622 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా… 35 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మూడో విడతలో 170 పంచాయతీలకు, 1512 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని వివరించారు. మూడోవిడతకు సంబంధించిన నామినేషన్‌ పత్రాల స్వీకరణ ఈ నెల 16, 17 తేదీల్లో కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 21, 25, 30 తేదీల్లో విడతల వారీగా పోలింగ్‌ జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పోటీలో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థీ పాటించాలని, పరిమితికి మించి ఖర్చులు చేయరాదని సూచించారు.పోలింగ్‌ అనంతరం మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ ప్రారంభించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికైన వార్డు సభ్యులతో కోరం ఏర్పాటు చేసి ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.

Other News

Comments are closed.