పోలవరంపై రాజీలేని పోరాటం సకాలంలో పూర్తి చేసేలా చర్యలు: దేవినేని

share on facebook

అమరావతి,జనవరి9(జ‌నంసాక్షి ): నదుల అనుసంధానం కోసం సిఎం చంద్రబాబు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇది సాధ్యం కాకున్నా, ఎపిలో సాధ్యం చేసి చూపామని ఎపి మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇందుకు పట్టిసీమ ఉదాహరణ అన్నారు. దీనిని విమర్శిచిన వారికి ఫలితాల ద్వారా సాధించి చూపామని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో అతి పెద్ద మహా సంగమం ఏర్పాటయ్యేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు పెన్నా-గోదావరి అనుసంధానానికి ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. నదుల అనుసంధానంతో తొమ్మిది జిల్లాల్లో సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చవచ్చని అన్నారు. పెన్నా-గోదావరితో సహా మిగతా నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రమే ఒక మహా సంగమంగా మారుతుందని, నీటి భద్రత ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటిదాకా 50 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి పనులకు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి లేదా జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.  కేంద్ర
మంత్రి గడ్కరీ గతంలో పోలవరానికి ఓసారి వచ్చారని, మరోసారి వస్తానని చెప్పారని, అది పండగకు ముందా, తర్వాతా అనేది తేలాల్సి ఉందని అన్నారు. ప్రాజెక్టుకు నిధుల కొరత రానివ్వబోమని గడ్కరీ స్వయంగా చెప్పారని తెలిపారు. ప్రాజెక్టు పనులు చకచకా జరిగేందుకు సిమెంటు, స్టీలు విషయంలో కొంత క్రెడిట్‌ ఇవ్వాలని స్వయంగా కేంద్ర మంత్రి ఆయా కంపెనీలను ఇంతకుముందే కోరారని  తెలిపారు.
అయితే పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ పూర్తిచేసి 2018 జూన్‌ నాటికి తొలిదశగా గ్రావిటీ ద్వారా నీళ్లు సరఫరా చేసే ప్రణాళిక ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా కనిపించడం లేదు. మూడు నెలలుగా అనేక పనులు అపరిష్కృతంగా ఉండిపోవడం ఇందుకు కారణంగా చెప్పాలి. వివిధ సాంకేతిక కారణాల వల్ల, కేంద్ర సంస్థలు కొన్ని సాంకేతిక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు 3 నెలల సమయం పట్టింది. గోదావరిలో ఈ ఏడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలో ప్రవాహాలు అసలేలేవు. అందువల్ల పనులు చేసేందుకు మంచి అవకాశం వచ్చింది. అలాంటి కీలకమైన పనిదినాలు కోల్పోయారు. ఇకపోతే  స్పిల్‌ వే కాంక్రీటు పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయి.  ప్రధాన డ్యాంలో డయా ఫ్రం వాల్‌ పనులు పూర్తయినా ఒక సీజన్‌లోనే పూర్తిస్థాయి డ్యాం పనులు పూర్తి చేయడం సాధ్యం కాదని, ఇందుకు రెండు సీజన్లు అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిత్తశుద్దితో పనులు పూర్తి చేసేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రాజీలేకుండా పనిచేస్తోందని అన్నారు.

Other News

Comments are closed.