పోలీసుల అదుపులో ప్రణయ్‌ హంతకులు

share on facebook

అమృత తండ్రి బాబాయ్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు

అమృతను పరమార్శించిన ఎంపి గుత్తా

హత్యకు నిరసనగా కొనసాగుతున్న బంద్‌

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అమృత

తండ్రే హంతకుడని వెల్లడి

అమ్మ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలిసేవి

హైదరాబాద్‌/ నల్గొండ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మిర్యాలగూడలో శుక్రవారం చోటుచేసుకున్న పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కిరాతకానికి పాల్పడిన యువతి తండ్రి, బాబాయిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఏ1 నిందితుడు మారుతీరావు, ఏ2 నిందితుడు శ్రవణ్‌కుమార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం కారులో పారిపోయిన నిందితుల గురించి పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు.

ప్రేమ వివాహం వ్యవహారంలో మిర్యాలగూడలో ప్రణయ్‌ అనే యువకుడిని దుండగులు అతి కిరాతకంగా దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసగా మిర్యాలగూడలో ఎస్సీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు ప్రణయ్‌ కుటుంబాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పరామర్శించారు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సంఘీభావం ప్రకటించారు. కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన తండ్రి.. అల్లుడిని అతి కిరాతకంగా అంతమొందించాడు. సఖ్యతగానే ఉంటానని నమ్మించి.. కిరాయి హంతకులతో మెడ తెగనరికించాడు. అత్యంత దారుణమైన ఈ పరువు హత్య శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మిర్యాలగూడలోని

ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి, ప్రేమలతల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్‌(24), అదే పట్టణానికి చెందిన వ్యాపారవేత్త తిరునగరు మారుతిరావు కుమార్తె అమృతను గత జనవరిలో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తి ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అమృత తన భర్త దగ్గరే ఉంటానని పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు తేల్చిచెప్పింది. అప్పటి నుంచి తన భర్త ఇంటి వద్దే ఉంటొంది. ప్రస్తుతం అమృత గర్భిణి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం అమృతను తీసుకుని ప్రణయ్‌, ఆయన తల్లి ఆసుపత్రికి వచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. ప్రధాన ద్వారం వద్దకు ప్రణయ్‌ చేరుకోగానే ఆసుపత్రిలోనే మాటు వేసిన దుండగుడు వెనకనుంచి వచ్చి అతడి మెడపై కత్తితో వేటువేశాడు. దీంతో ప్రణయ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దుండగుడు మరో వేటు వేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ హత్యకు అమ్మాయి తండ్రి మారుతిరావే కారణమని భావించిన పోలీసులు ఏ1గా అతడిని, ఏ2గా అమృత బాబాయి శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. ప్రేమించి, పెళ్లి చేసుకున్నందుకు భార్య తండ్రి చేతిలోనే హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను నేతలు ఓదార్చారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఎంపీ గుత్తా హావిూ ఇచ్చారు. ప్రేమపెళ్లి ఇష్టం లేకనే భార్య తండ్రి మారుతీ రావు ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. తన కళ్ల ఎదుటే ప్రణయ్‌ను నరికి చంపించిన తన తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకున్న పరువు హత్య ఘటనలో ప్రణయ్‌ భార్య అమృత కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎవరు కనిపించినా ఆమె కన్నీరు ఆగడం లేదు. ప్రణయ్‌ అనే యువకుడిని అతని భార్య తరఫు బంధువులు అతి కిరాతకంగా అంతమొందించారు. ఈ ఘటన గురించి ప్రణయ్‌ భార్య అమృత విూడియాతో మాట్లాడారు. ‘ప్రణయ్‌ని హత్య చేయించింది మా నాన్నే. ఆయన ఆలోచనల గురించి అమ్మ ఎప్పటికప్పుడు చెప్పేది. ప్రణయ్‌ని చంపేందుకు చాలా రోజులు రెక్కీ నిర్వహించారు’ అని చెప్పింది. నేను, ప్రణయ్‌ నవ్వుకుంటూ వెళ్తున్న సమయంలో పక్క నుంచి ఎవరో గట్టిగా కొట్టారు. వెంటనే ప్రణయ్‌ కిందపడిపోయాడు. అనంతరం దాడి చేసి అతన్ని చంపేశారు. ఎవరు దాడి చేశారో నేను స్పష్టంగా చూడలేదు. నా కదలికలను ఎప్పటికప్పుడు మా నాన్న తెలుసుకునేవారు. మాపై మా నాన్న నిఘా ఉంచారు. గోల్డ్‌షాప్‌లో ఉన్నావ్‌.. బ్యూటీపార్లర్‌లో ఉన్నావ్‌.. అని మా అమ్మ నాకు ఫోన్‌ చేసి చెప్పేది. నాన్నకు మా గురించి ఎవరో కాల్‌ చేసి చెప్పారని అంటుండేది. మేం ఎక్కడ ఉన్నా క్షణాల్లో మా నాన్నకు తెలిసిపోయేది. మా నాన్న ఆలోచనల గురించి కూడా మా అమ్మ నాకు చెప్పేది. ప్రస్తుతం నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం అమ్మకు చెప్పాను. అప్పటి నుంచి అమ్మ ఫోన్‌ చేస్తూ నా ఆరోగ్యం గురించి అడుగుతూ ఉండేది. అయితే నాన్న మాత్రం గర్భం తొలగించుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవారంటూ విలపించింది. ప్రణయ్‌ చనిపోయిన వెంటనే ఈ ఘటన

గురించి నాన్నకు ఫోన్‌ చేశా. ఎవరో దాడి చేసి ప్రణయ్‌ని చంపేశారు అని చెప్పా. అయితే వినిపించడం లేదని నాన్న ఫోన్‌ పెట్టేశారు. నాపై కూడా దాడి చేశారని చెప్పినా పట్టించుకోలేదు. ఆస్పత్రికి వెళ్లు అని మాత్రం చెప్పారు. వెంటనే ప్రణయ్‌ వాళ్ల నాన్నకు కూడా ఫోన్‌ చేశా. ప్రణయ్‌ని చంపేస్తే నేను వెనక్కి వస్తాననుకొని ఇలా చేశారు. అయితే నేను నాన్న వద్దకు వెళ్లను. ప్రణయ్‌ చాలా మంచివాడు. దారుణంగా చంపేశారని అమృత చెబుతూ కన్నీటిపర్యంతమైంది. హంతకుడు తన తండ్రైనా సరే ఉరి తీయాల్సిందే అని అమృత పట్టుబడుతోంది. తండ్రే భర్తను హత్య చేయిస్తాడని ఊహించలేదని ఆమె వాపోయారు. నిన్న తాను ఆస్పత్రికి రాకపోయినా ప్రణయ్‌ బతికేవాడోమో అని అమృత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జ్యోతి ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్న అమృతను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు. తన భర్త ప్రణయ్‌ను చూపించాలంటూ ఎంపీ గుత్తాను అమృత వేడుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

Other News

Comments are closed.