పోలీస్‌ శాఖలో ప్రక్షాళనకు ఇదే సమయం

ఇటీవల పోలీస్‌ శాఖలో వెలుగుచూస్తున్న వ్యవహారాలు చూస్తుంటే ఆ శాఖలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. వరుసగా అనేక విషయాలు గందరగోళంలో పడేసేలా ఉన్నాయి. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసినా వెట్టిని వదిలించుకోవడం లేదు. ఉన్నతస్థానాల్లో ఉన్న బాస్‌లు కిందిస్థాయి ¬ంగార్డులను, పోలీసుల చేత ఊడిగం చేయించుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి ఎస్పీ ¬ంగార్డులతో వెట్టి చేయించుకున్న విషయం వెలుగుచూసినా చర్యలు తీసుకోలేదు. అలాగే తెలంగాణ ఏర్పడ్డ తరవాత పోలీస్‌ స్టేషన్ల వారీగా ఖర్చులకు వెనకాడరాదన్న ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్‌ మెయింటనెన్స్‌ నిధులు విడుదల చేశారు. అయినా వసూళ్ల దందా ఆగడం లేదు. తగాదాల్లో తలదూర్చడం, డబ్బులు వసూలు చేయడం, సమాంతరంగా మాఫియా వ్యవహారాలు నడిపిస్తున్నారు. పై అధికారులు కిందిస్థాయి పోలీసులతో వసూళ్లు చేయించడం పోలీస్‌ శాఖలో షారా మామూలైపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విసయమే. అయితే దీనిలో మరోకోణం ఉంది. మితివిూరిన రాజకీయ జోక్యం కారణంగా పోలీసుల పోస్టింగ్‌లు కాస్ట్‌లీగా మారాయి. రాజకీయ నేతలు పైరవీలు చేసి పోస్టింగ్‌లు వేయిస్తున్నారు. ఒక్కో ఎస్‌ఐ స్థాయిని బట్టి రేటును నిర్ణయిస్తున్నారు. లక్షల్లో పోస్టింగ్‌ ధరలు పలుకుతున్నాయి. ట్రాన్స్‌ఫర్‌,పోస్టింగ్‌ ఇలా ఏదైనా పైరవీతో కూడుకున్నదే కావడంతో వసూళ్ల దందా ఆగడం లేదు. ఇక నయీం వ్యవహారం వెలుగు చూశాక పోలీసులు ఎంతగా దిగజారారో అసహ్యం వేస్తోంది. ఓ నేరస్థుడితో లాలూచి పడి గ్యాంగ్‌స్టర్‌ వ్యవహారాలకు మద్దతు ఇచ్చారు. అక్రమంగా డబ్బు సంపాదించారు. అడ్డం అనుకున్న వారిని తొలగించేలా పురిగొల్పారు. ఇవన్నీ వెలుగుచూస్తే మంచిది. కానీ ఆ మేరకు దర్యాప్తు సాగుతుందా అన్నదే అనుమానాం. తాజాగా మెదక్‌ జిల్లా కుకునూరుపల్లె ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఉదంతం పోలీస్‌ శాఖలో పాతుకపోయిన వసూళ్ల పర్వాన్ని బట్టబయలు చేసింది. పోలీసులు, వసూళ్లు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఏర్పడిపోయిందన్నది కింది స్థాయి ప్రజలకు నిత్య అనుభవమే అయినా ప్రపంచానికి తెలిసేలా ఈ ఆత్మహత్య రుజువు చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వాణిజ్య సంస్థల వంటివాటి నుంచి నెల నెలా మామూళ్లు వసూలు చేసేందు కు ప్రత్యేక సిబ్బందే ఉంటారంటే ఆశ్యర్యం కలిగిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల నుంచి మామూళ్లు గుంజుతుంటే.. పైఅధికారులు కిందిస్థాయి సిబ్బంది నుంచి వసూలు చేస్తున్నారనేది తేలి పోయింది. ఎన్ని సంస్కరణలు తెస్తున్నా, పోలీసులను ప్రజలతో సన్నిహితంగా మార్చుతామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీస్‌ శాఖలో వసూళ్లను గమనించి, ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో సిఎం కెసిఆర్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వసూళ్లను ఆపేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుశాఖకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేసారు. అధునాతన వాహనాలు సమకూర్చడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమయ్యే డీజిల్‌ కోటా పెంచారు. స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు నిధులిచ్చారు. స్టేషన్‌ ఖర్చులకు కూడా నెలనెలా రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకూ అందజేస్‌ఉతన్నారు. స్టేషన్‌ పరిధి, పనిభారాన్ని బట్టి ఇవి విడుదల చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వం ఆశించిన మార్పు కనిపిస్తోంది. పోస్టింగ్‌ కోసం నాయకులకు డబ్బులివ్వడం, ప్రజల నుంచి వసూలు చేసి అధికారులకు పంచడం వంటివి చాలావరకూ నిలిచి పోయాయని సమాచారం. అయితే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితిలో మార్పు రాలేదు. వేధింపులు మితివిూరినప్పుడు మాత్రమే ఇవి వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే పోలీసుశాఖలో రాజకీయ జోక్యాన్ని, లేఖ తెచ్చుకున్న వారికే పోస్టింగ్‌ అనే పద్ధతిని నిలిపివేయడమే మార్గం. అలా చేయాలంటే పారదర్శకంగా పోస్టింగ్‌లను ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో బదిలీలు ఉండాలి. కోరుకున్నచోట పోస్టింగ్‌ అన్న పద్దతికి చెక్‌ పెట్టాలి. బదిలీ కోసం ముడుపులు చెల్లించుకున్న వారు ఈ వసూళ్లకు పాల్పడుతూ, పై అధికారికి ముట్టచెప్పాల్సి ఉంటుంది కనుక దీనిపైనా నిఘా పెట్టాలి. చాలాసార్లు ఇలాంటి వ్యవహారాలు వివాదాస్పద మవుతున్నాయి. పోస్టింగ్‌ తెచ్చుకోవాలంటే స్థానిక నాయకుడికి ముట్టజెప్పాలి. విధుల్లో చేరిన తర్వాత పై అధికారులకు క్రమం తప్పకుండా వాటాలు ఇవ్వాలి. దీంతో కిందిస్థాయి సిబ్బంది విసిగిపోతున్నారు. తాజాగా మెదక్‌ జిల్లాలో ఎస్సై ఆత్మహత్య ఘటన నేపథ్యంలో పోలీసుల వసూళ్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వసూళ్ల వ్యవహారం మరే ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా పోలీస్‌ శాఖలో సంప్రదాయంగా మారింది. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నెలనెలా వసూలయ్యే మొత్తాన్ని బట్టి దానికి ఒక ధర నిర్ణయిస్తారు. చాలా ప్రాంతాల్లో సంబంధిత శాసనసభ్యుడు లేదా ఇతర నాయకుడికి ఆ మొత్తం చెల్లిస్తేనే అక్కడ డ్యూటీ వేయించుకునే పరిస్తితి తీసుకుని వచ్చారు. ముడుపులు చెల్లించకుండా ఎవరైనా ఆ పోస్టులో చేరినా తప్పించేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తారు. అందుకే పోస్టు కోసం ప్రయత్నించేవారు ముందుగానే స్థానిక నేతల సిఫార్సులలేఖ తీసుకెళ్లే సంప్రదాయం కొనసాగుతోంది. లక్షల్లో డబ్బు కుమ్మరించి పోస్టింగ్‌ తెచ్చుకున్న అధికారి అదంతా సంపాదించుకునేందుకు అవకాశమున్న అన్ని వక్ర మార్గాల్లోనూ వసూళ్లు మొదలుపెడతున్నాడు. పోలీసుశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే నెలనెలా వసూళ్లకు అవకాశం ఉంటుంది. ఆ పైస్థాయి అధికారులంతా వీరిపై ఆధారపడాల్సిందే. అంటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నెలనెలా వసూలు చేసే మొత్తంలో కొంత భాగాన్ని పైఅధికారులకు సమర్పించుకోవడం షరామామూలే. దేశవ్యాప్తంగా ఇదే సంప్రదాయం ఉంది. దీనిని ఛేదిస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు. రాజకీయ జోక్యం లేకుండా చేస్తే తప్ప ఇది ఆగదు. ప్రధానంగా రాజకీయ నాయకుల సిఫార్సులను బుట్టదాఖలు చేసే కఠిన నిర్ణయాలు అవసరం. అందుకు ఇదే సరైన సమయం. సిఎం కెసిఆర్‌ ఈ వ్యవస్థపై పోరాడితే పోయేదేవిూ లేదు. కనీసం బాగుపడిందన్న తృష్తి అయినా మిగులుతుంది.