ప్రకృతి విధ్వంసానికి పరాకాష్ట 

share on facebook

ఏటా మొక్కలు నాటుతున్నా..భూగర్బ జలాలు ఇంకేలా చేస్తున్నా,,ఏయేటికాయేడు దేశంలో ఎండలు మండిపోతున్నాయి. పర్యావరణ విధ్వంసంపై దృష్టి పెట్టకపోవడంతో  భానుడు చెలరేగిపోతున్నాడు. ఎండ వేడిమి, వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరభారతం అయితే మరీ నిప్పుల కొలిమిలా తయారవుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ యేడు చలికాలం వణికిస్తే..ఎండాకాలం ఉడికిస్తోంది. ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులకు మనం చేస్తున్న విద్వంసం కారణమని గుర్తించడం లేదు. పాలకులతో పాటు..ప్రజలు కూడా ఇందుకు బాధ్యులే. . కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. మేఘాలు తొలగిపోయి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడడంతో సూర్యుని కిరణాలు నిటారుగా తాకుతుండటంతో రేడియేషన్‌ పెరిగి భూమి బాగా వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇదంతా మనకుగా మనం చేసుకున్న పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి. అడవులను నరకడం, కాంక్రీట్‌ జంగల్‌ను పెంచడం, మొక్కల పెంపకాన్ని విస్మరించడం, భూగర్భ జలాలను తోడేయడం, ఇసుకను తవ్వితీయడం వంటి అనేకానేక చర్యలు ఇందుకు కారణమయ్యాయి. దీనికితోడు పర్యావరణ విధ్వంసానికి తోడ్పడే ప్లాస్టిక్‌ విపరీతంగా వినియోగిస్తున్నాం. ప్లాస్టిక్‌ ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో ఎండలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏటా విధ్వంసం జరుగుతున్నా దానిని అడ్డుకునే కఠిన చర్యలను అవలంబించడం లేదు. ఎవరికి వారు మాకేంటి లే అన్న ధోరణిలో ఉన్నారు. ప్రచండ భానుడి ప్రతాపానికి దేశం అల్లాడుతోందని ఊరుకుంటే ఇకముందు కూడా ఇలాగే ఉంటుంది.  ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య కూడా తీవ్రం అయ్యింది. ఇలాగే మనం ముందుకు సాగితే దేశం ఎడారిగా మారుతుందనడంలో సందేహం లేదు. దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడి ఉండకపోవడం వల్ల పచ్చదనం మాయమయ్యింది. పచ్చదనం అన్నది లేకుండా పల్లెల్లో ఉన్న చెట్లను ఎక్కడిక్కడ నరికి వేశారు. గతంలో ఇంటిముందు ఉండే చెట్లను కూడా డబ్బుకోసం అమ్ముకున్నారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో కోతుల బెడద కారణంగా చెట్లను తెగనరికే స్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలు ఎండవేడిమికి  అతలాకుతలం అవుతు న్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు రెండు రాష్ట్రాల్లోను తాగునీటికి కటకట ప్రారంభం అయింది. రోహిణీ కార్తె రాకముందే ఎండలు మండిపోతున్నాయి. చూస్తుంటే ఈ వేసవి మొత్తం వేసవి ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోయేలా కనిపిస్తోంది. మూడునుంచి నాలుగు డిగ్రీలు సాధారణ ఉష్ణోగ్రతలకు అదనంగా నమోదవుతుండటంతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఉదయం నుండే మొదలవుతున్న ఎండవేడిమి  సాయంత్రం అయినా ఎక్కడా తగ్గకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తెలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతున్నాయి.   అన్నింటిని మించి మంచినీటి సమస్య ఈ యేడు తీవ్రంగా ఉంది. ఏటా ఎండాకాలం బాధలను వానాకాలంటో గుర్తుంచుకోక పోవడం వల్ల మంచినీటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. అనంత మొదలుకుని ఆదిలాబాద్‌ వరకు మంచినీటి సమస్య లేని జిల్లా లేదంటే అతిశయోక్తి కాదు. తాగునీరు కాదుకదా రోజువారీ నీటికి కటకట తప్పడం లేదు. ప్రధాన జలాశయాలు అడుగంటి పోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. పాలకులు కూడా కఠినంగా చర్యలు తీసుకుని పర్యావరణ విధ్వంసాన్ని ఆపకపోతే రానున్న రోజులు మరింత భయంకరంగా ఉండడం ఖాయమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకాలం మనం చేసిన
విధ్వంసం కారణంగానే అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతుల చేరుతున్నాయని బెంబేలు పడుతున్న మనం ఎండాకాలం ముగియగానే మళ్లీ యధావిధిగా ఉంటున్నాం. కనీసం ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటుతూ పోయినా కొంతయినా ఉపశమనం లభించేది. భూగర్భజలాలు అడుగంటడం, భూతాపం పెరిగిపోవడంతో మంచినీటిసమస్య కూడా అధికం అవుతున్నది. బోర్లువేసి నీటిసమస్య కొంత తగ్గించాలని భావించినా ఎంత లోతుకు తవ్వినా నీళ్లు రాని పరిస్థితులు దాపురించాయి. వేసవి తాపంనుంచి ఉపశమనం పొందేందుకు ప్రభుత్వాలపరంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేవు. రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటివనరులు వేసవి తాపానికి ఆవిరి అవుతున్నాయి. మండుతున్న ఎండలు అటు శారీరక అస్వస్థతలు పెంచడంతో పాటు ప్రజల దాహార్తిని కూడా పెంచుతున్నాయి. ఉష్ణోగ్రతకు పక్షులు, పశువులు అసువులు బాస్తున్నాయి. ఉదయం పదిగంటలు దాటినప్పటినుంచీ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత ప్రభావం, వడగాడ్పులు తీవ్రతరం కావడంతో రాష్ట్రంలో రేడియేషన్‌ ప్రభావం కూడా పెరుగుతున్నదని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఈ దుస్తితి నుంచి దూరం కావాలంటే పర్యావరణ హితమైన చర్యలకు ఇప్పటి నుంచే పూనుకోవాలి. పర్యావరుణ పరిరక్షణకు చెట్ల పెంపకం, భూగర్భ జలాలను పెంచే చర్యలను ముమ్మరం చేయాలి. అడవుల నరికివేతను తీవ్రమైన చర్యగా పాటించాలి. పాలకులు మేల్కోకపోతే భవిష్యత్‌ మరింత మండిపోవడం ఖాయం. ఇకపోతే ప్రస్తుత ఎండలకు తోడు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  పర్యావరణ విధ్వంసానికి ప్రత్యక్ష నిదర్శనవిూ విపత్తు అని ప్రజలు గుర్తించేలా ప్రచారం చేయాలి.

Other News

Comments are closed.