ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఇక పనిచేయాలి

share on facebook

ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఎలా నడుచుకోవాలన్న దానిపైనా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. గెలిచిన టిఆర్‌ఎస్‌ తెలంగాణ పునర్నిర్మాణం కోసం కట్టుబడి పనిచేయాలన్న సంకల్పం తీసుకోవాలి. అలాగే కూటమి నేతలుకూడా తెలంగాణ పునర్నిర్మాణంలో తమవంతు కీలక భూమిక పోషించాలి. ఓటమి అన్నది ఎన్నికల్లో  సర్వసాధారణం కనుక ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వంతో పనులు చేయించే పాత్రలో విపక్షనేతలు నిమగ్నం కావాలి. ఓటమికి ఇంకా కారణాలు వెతుక్కుంటూ పరస్పర విమర్శలు చేసుకుంటూ పోతే ప్రజలు క్షమించరు. ఓటమికి కాంగ్రెస్‌  పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరించిన విధానాలు కూడా కారణంగా చూడాలి. ఒక్కసీటును కూడా గెలవలేని వారు అంతా ముఖ్యమంత్రులుగా చెప్పుకున్న వారు ఓడిపోవడం కూడా మంచిదే. గతంలో వారు పనిచేసిన తీరును ఆధారం చేసుకునే ప్రజలు ఓడించారు. ఇంకా పార్టీని అంటిపెట్టుకుని గబ్బిలాల్లాగా ఉంటామంటే కుదరదు. ప్రజలు కూడా దీనిని హర్షించరని నిరూపించారు. వీరంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఇక వారధిగా పనిచేయాలి. సుదీర్ఘ కాలం ప్రజాక్షేత్రంలో ఉన్నామని చెప్పుకున్న జానారెడ్డి,కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మల్లు రవి, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, డికె అరుణ లాంటి వారంతా తాము సైతం అంటూ సిఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ఏనాడూ పెద్దగా పనిచేయకుండా ప్రకటనలకే పరిమితం అయితే గుణపాఠం తప్పదని ప్రజలు నిరూపించారు. అందుకే వీరంతా ఇప్పుడు  ప్రజాక్షేత్రంలో ఐదేళ్ల పాటు పనిచేసి తమ సత్తా చాటాలి.
ఎవరి అంచనాలకు అందని విధంగా ప్రజాకూటమి ఓడిపోయిందన్న నిజాన్ని గుర్తించి ముందుకు సాగాలి.   ఓటమికి కుంటిసాకులు చెప్పి తప్పించుకోకుండా బాధ్యతల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పదవుల నుంచి తప్పుకొని కొత్తవారికి అవకాశాలు కల్పించాలి. యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలి. ఓటమి పాలయిన వారు సైతం వాస్తవాన్ని గుర్తించ వలసిందే. గుర్తించి, భవిష్యత్తులో తమవంతు నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మరో అయిదేండ్ల పాటు  అధికారంలో ఉంటుంది కనుక నిర్మాణాత్మక వైఖరితో ముందుకు సాగాలి. కెసిఆర్‌ వ్యక్తిగత, అధికారిక వ్యవహార సరళి గురించి అనేకానేక విమర్శలు ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారపర్వంలోనూ వాటి గురించే విమర్శలు చేశారు. వాటివల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సున్నితంగా చర్చించాలి. ఇప్పుడు లభించిన ఘనవిజయంతో అవన్నీ ప్రజలు ఆమోదించారను కోవడానికి లేదు. ప్రభుత్వం విూద, దాని నాయకుడి విూద వచ్చిన విమర్శలపై విపక్షాలు గట్టిగా పోరాడి నిలబడాలి. ఏరకంగా అధికార పార్టీ నేత తప్పులు చేస్తున్నారో చెప్పగలగాలి. విజయం కెసిఆర్‌కు సానుకూల ఓటింగ్‌ వల్ల వచ్చిందా, కూటమికి ప్రతికూల ఓటింగ్‌ వల్ల వచ్చిందా అన్నది విశ్లేషించుకుంటూనే ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుందన్నదే ప్రధాన ఎజెండాగా విపక్షాలు తమ కర్తవ్య నిర్వహణ చేసుకోవాలి. ఇకముందు ప్రజల సంక్షేమం లక్ష్యంగా  ప్రచారయుద్ధానికి సంబంధించిన సమగ్రవ్యూహం రూపొందించుకోవాలి. మొన్నటి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అనేక అంతర్గత లోపాలతో ఓటమి పాలయ్యింది. ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న తరువాత 2014 ఎన్నికల వరకు ఏడాది వ్యవధి ఉన్నా, దాన్నొక బ్రహ్మాస్త్రంగా తీర్చిదిద్దుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ విఫలమయింది. ప్రత్యేక రాష్ట్రం అనివార్యమని తెలిసినా చివరి నిమిషం దాకా మంత్రిపదవులను పట్టుకుని వేలాడడం అన్నది కూడా వారి పదవీలాలసకు పరాకాష్టగా ప్రజలు గమనించారు. నాడు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మినహా, రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన నేతలు, శాసనసభ్యులు ఎవరూ ఉద్యమంలో మనసు పెట్టి పనిచేయలేదు.  ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. తెరాసను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి పేరుతో ఏకం కావాలని తెలుగుదేశం, సీపీఐ,తెలంగాణ జనసమితి  పార్టీలు ముందుకొచ్చినా కాంగ్రెస్‌ అందుకు రాజకీయంగా వారిని ఉపయోగించు కోవాలని చూసిందే తప్ప తమకు తాముగా తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలన్న భావనను కల్పించలేక పోయింది. కోదండారమ్‌ను ముందు నిలబెట్టి ఆయన సారథ్యంలో కూటమి నడుస్తుందని ప్రకటన మాత్రం చేసి సీట్ల పంపిణీలో తాత్సారాం, ఇతర పార్టీలను అవమానకరంగా వ్యవహరించడం మాత్రం మానలేదు. ఇవన్నీ కళ్లముందు కనిపించిన సత్యాలు. అందువల్ల ఇక వాటిని మననం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలి. అధికారంలో ఉంటేనే ప్రజా సేవచేయడం కాదు. విపక్షంలో ఉండీ సేవ చేయగలగాలి. కాంగ్రెస్‌ అతి విశ్వాసం, తామే అధికారంలోకి రావాలన్న యావ, తామే రేపటి సిఎంలమన్న అహంభావం వెరసి  ఓటమికి కారణాలుగా గుర్తించాలి. మిత్రపక్షాలను అవమానపరిచే విధంగా వ్యవహరించిన ఉత్తమ్‌,కుంతియా లాంటి వారు పార్టీ పదవులను త్యజించాలి. కాంగ్రెస్‌ వర్గాల నేతలు తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు కూటమిని గెలిపించే నేతలకు అవకాశం రాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఐకాస నేతగా కోదండరాంకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఆయన అధినేతగా ఉన్న తెజసను పెద్దగా పట్టించుకోకుండా కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. కూటమి తరఫున కోదండరాంను రాష్ట్రమంతా విస్తృతంగా తిప్పి ప్రచారం చేయిస్తే తెరాసకు దీటుగా ఉండేదని కూటమి వర్గాలు చెప్పాయి. కానీ ఆయనను వినియోగించు కోవడం లోనూ కూటమి పార్టీలు  విఫలమై చివరికి ఓటమిని మూటగట్టుకున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకుండా కెసిఆర్‌ని నిందించడం తగదు. అందుకే ఇక విమర్శలకు పదను పెట్టకుండా ఈ ఐదేళ్లు ప్రజల కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలి.
————————

Other News

Comments are closed.