ప్రత్యేక అధికారుల పాలన.. రాజ్యాంగ విరుద్ధం

share on facebook


– మూడు నెల్లలోగా పంచాయతీ ఎన్నికలు జరపాలి
– తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్‌, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : తెలంగాణలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పలుపిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి విచారించిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పంచాయతీలకు మూడునెలల్లోగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై న్యాయస్థానం తప్పుబట్టింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని.. ఎన్నికల పక్రియ వారి ద్వారానే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని.. వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం
మంచి పద్ధతి కాదని హైకోర్టు అభిప్రాయపడింది. జులై 31వ తేదీతో తెలంగాణలో పంచాయతీల గడువు ముగియడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Other News

Comments are closed.