ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రభుత్వాల ఆసక్తి

share on facebook

సమరశీల పోరాటాల ద్వారా ఎదుర్కొంటాం

బీఎంఎస్‌ జాతీయ నాయకుడు బీకే. రాయ్‌

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు అప్పగించి సొమ్ము చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్‌ సింగ్‌ బాటలోనే పయనిస్తున్నారని బీఎంఎస్‌ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్‌ఛార్జీ బీకే. రాయ్‌ పేర్కొన్నారు. ఈ విధానాలను బీఎంఎస్‌ కార్మిక సంఘం సమరశీల పోరాటాల ద్వారా ఎదుర్కొంటుందన్నారు. బీఎంఎస్‌ మాత్రమే కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన, జీతభత్యాల పెరుగుదల కోసం పోరాటాలు చేస్తున్నదని స్పష్టం చేశారు. బీఎంఎస్‌ కార్మిక సంఘం 26వ రాష్ట్ర మహా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వరంగ పరిశ్రమల కార్మికుల వ్యతిరేక వైఖరిపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని, ప్రభుత్వరంగ పరిశ్రమలోని కార్మికులు పనిచేయకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, పరిశ్రమలను ప్రైవేటీకరించడం, అమ్మివేయడాన్ని బీఎంఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం నేర్పుతామని, ఏ కార్మికులతోనైతే తెలంగాణ సాధించాడో వారినే అణగదొక్కుతున్నాడని ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను బీఎంఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. తమతో పాటు పనిచేస్తోన్న 11జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించినట్లుగా నటిస్తున్నాయి తప్పితే వారిలో చిత్తశుద్ధి లేదని ఏ మాత్రం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వరంగ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రక్షణ, బ్యాంకింగ్‌, స్టీల్‌, సిమెంట్‌ రంగాలలో దశలవారీ పోరాటాలు నిర్వహించామన్నారు. బొగ్గు విభాగంలో ఇతర కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మె చేశాయని, బీఎంఎస్‌ మాత్రమే ఐదు రోజులు దేశవ్యాప్త బొగ్గు సంస్థలలో సమ్మె నిర్వహించనున్నదని స్పష్టం చేశారు. బీఎంఎస్‌ సమ్మె దెబ్బతో బొగ్గు మంత్రి దిగి వచ్చి కోలిండియా, సింగరేణిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించినట్లు బీఎంఎస్‌తో అవగాహనకు వచ్చారని వెల్లడించారు. 1991లో పీవీ. నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల ఫలితంగా ప్రభుత్వరంగ పరిశ్రమలు, కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ. నరసింహారావు విధానాలనే తదుపరి ప్రధాన మంత్రులైన అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోదీ కూడా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణకు అనుసరించాల్సిన కార్యచరణపై 19న ఢిల్లీలో బీఎంఎస్‌ అనుబంధ ప్రభుత్వరంగ సంస్థలతో జాతీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు బీకే. రాయ్‌ వెల్లడించారు.

Other News

Comments are closed.