ప్రశాంతంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

share on facebook

ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది..!  లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపయ్య మళ్లొస్తానంటూ గంగమ్మ సన్నిధికి చేరుకున్నాడు..! గణపతి బప్పా మోరియా నినాదాలు హోరెత్తుతుండగా.. అశేష భక్త జన నీరాజనాల నడుమ… శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి నిమజ్జన ఘట్టం కమనీయంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు మహా గణపతి నిమజ్జనాన్ని కళ్లారా చూసి పులకించిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,  నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు పలువురు నేతలు నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఉదయం 6 గంటలకు విఘ్నేశ్వరుడికి కలశ ఉద్వాసన నిర్వహించారు. ఉదయం 7 గంటలకు వాహన పూజ చేసిన అనంతరం, శోభాయాత్ర ప్రారంభమైంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మహా గణపతి శోభాయాత్రను ప్రారంభించారు. ఉదయం  10 గంటల కల్లా శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్ దగ్గరకు చేరుకుంది. అనంతరం టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, సచివాలయం ఫ్లై ఓవర్, లుంబినీ పార్క్  మీదుగా శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. అశేష భక్త జనం ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో సాగర్ తీరమంతా హోరెత్తింది. మధ్యాహ్నం ఒంటిగంట కల్లా క్రేన్ నెంబర్.6 దగ్గరకు మహాగణపతి చేరుకున్నాడు.

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రతి ఏటా క్రేన్ నెంబర్ 4 దగ్గర జరిగేది. అయితే అక్కడ లోతు తక్కువగా ఉండటం వల్ల నిమజ్జనం సగమే అయ్యేది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహం గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ సారి సంపూర్ణ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాగర్‌లో అత్యధిక లోతు ఉన్న ప్రాంతం కోసం డ్రోన్ల సాయంతో శోధించింది. క్రేన్ నెంబర్ 6 వద్ద 20 అడుగుల లోతు ఉన్నట్లు నిపుణులు సూచించడంతో ఈసారి అక్కడే నిమజ్జనం నిర్వహించారు. అత్యంత  భారీగా భారీగా 61 అడుగుల ఎత్తు, 45 టన్నులకు పైగా బరువున్న గణపతి శోభాయాత్ర కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  క్రేన్ నెంబర్ 6 దగ్గరకు మహాగణపతి చేరుకోగానే… విగ్రహం చుట్టూ వెల్డింగ్ పనులతో జాయింట్లు తొలగించారు. అనంతరం గంగాహారతితో పాటు… గణపతికి పూజలు నిర్వహించారు.మంత్రి తలసాని ఈ పూజల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రత్యేక క్రేన్ సాయంతో మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు ద్వాదశాదిత్య మహాగణపతిని సాగర్‌లో నిమజ్జనం చేశారు. మొత్తంగా ఈ సారి కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో మధ్యాహ్నం కల్లా ఈ ఘట్టం పూర్తయ్యింది. పదకొండు రోజులు ఘనమైన పూజలందుకున్న మహాగణపతిని భక్తులు సాదరంగా గంగమ్మ సన్నిధికి సాగనంపారు. వెళ్ళిరా గణపయ్యా… మళ్లి రా గణపయ్యా అంటూ… వీడ్కోలు పలికారు.

Other News

Comments are closed.