ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను పట్టించుకోరా?

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా ప్రైవేట్‌ టీచర్లు ఉన్నారని దాదాపు తెలంగాణలోని 90 శాతం మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వీరిపై ఉందనిప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల యూనియన్‌ అధ్యక్షుడు షేక షబ్బీర్‌ అలీ అన్నారు. సామాజికి బాధ్యతగా పనిచేస్తున్న ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. తక్కు వేతనాలతో ఎక్కువ పనులు చేయిస్తూ వెట్టి చేయించుకుంటున్నారని అన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్న ప్రైవేట్‌ టీచర్లు అనేక వృత్తిగతమైన ఇబ్బందులు ఎదుర్కొటున్నారని అన్నారు. పెద్ద బాధ్యతను మోస్తున్న టీచర్లు అంతకుమించిన సమస్యలనూ భరిస్తున్నారు. పనిగంటలు పెచ్చి, ఇతర పనులను కూడా విధుల్లో చేర్చి ప్రైవేట్‌ టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా సెలవుల్లోనూ విధులు నిర్వహించాలని యాజమాన్యాలు హుకూం జారీ చేస్తున్నాయని అన్నారు. ఉద్యోగం కోసం తప్పని పరిస్థితిలో ప్రైవేట్‌ టీచర్లు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. పాఠాలు చెబుతూ, ఇతర రాత పనులు చేస్తూ క్లర్క్‌గా పనులు నిర్వహిస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడిలో అసలు పని బోధన చేయలేక పోతున్నామని ప్రైవేట్‌ టీచర్లు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ టీచర్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపం లాంటిదని, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఊడిగం చేస్తున్న ఉద్యోగభద్రత లేదన్నారు. దీంతో అభద్రతా భావంతో ప్రైవేట్‌ టీచర్‌ కొట్టుమిట్టాడుతున్నాడు. అసలే అర కొర జీతాలు ఇస్తూ, మరోవైపు అన్ని పనులు నెత్తిన వేస్తూ ఎదురు చెప్పితే ఉద్యోగాలు ఉండవని యాజమాన్యాలు బ్లాక్‌మేల్‌ చేస్తున్నాయని పలువురు ప్రైవేట్‌ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సాధారణ సమయాలతో పాటు ప్రత్యేక తరగతుల పేరుతో గంటల కొద్దీ క్లాసులు ఏర్పాటు చేయడంతో మహిళా ఉపాధ్యాయులు శారీరక సమస్యలకు గురవుతున్నారు. జీతాల చెల్లింపుల్లోనూ యాజమాన్యం వివక్ష చూపుతుంది. విద్యాహక్కు చట్టం ఎమ్‌ఎస్‌-1 ప్రకారం యాజమాన్యం ఆదాయంలో 15 శాతం డబ్బును ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కేటాయించాలి. పి.ఎఫ్‌, వైద్య, ఇతర సదుపాయాల నిమిత్తం కేటాయించాలి. కాని యాజమాన్యాలు నిబంధనలకు పాతర వేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని షబ్బీర్‌ అలీ అన్నారు. వేల రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూళ్లు చేస్తూ ఖజానా నింపుకుంటున్నా, సంక్షేమం కోసం ఖర్చు చేయడం లేదన్నారు. ఒకవైపు పనుల భారం మోపుతో, మరోవైపు ర్యాంకులు రాకపోయినా, ఉత్తీర్ణత శాతం తగ్గినా టీచర్లపైనే బాధ్యత వేస్తూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో అటు ర్యాంకులు సాధించేలా బోధన చేయలేక, ఇటు ఇతర పనులు చేయలేక టీచర్లు సతమతమవుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఈ ధోరణి మరీ ఎక్కువగా ఉన్నట్లు ప్రైవేట్‌ టీచర్లు చెబుతన్నారు. ప్రైవేట్‌ టీచర్లకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సెలవుల్లోనూ వివక్ష చూపుతున్నాయన్నారు. ఈ సమస్యలపై సర్కార్‌ చర్చించి నిర్నయాలు తీసుకోవాలని ఆయనకోరారు.

Other News

Comments are closed.