ప్రైవేట్‌ విద్యా సంస్థలపై వ్యతిరేక భావం లేదు

share on facebook

ప్రభుత్వానికి ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు రెండు కళ్లలాంటివి
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అంతా సహకరించాలి
కడియం శ్రీహరి
వరంగల్‌,మే16(జ‌నం సాక్షి):  ప్రభుత్వానికి ప్రైవేట్‌ విద్య సంస్థల పట్ల ఏ రకమైన వ్యతిరేక భావం లేదని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.  తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యాప్తికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేట్‌ విద్యా సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రైవేట్‌ పాఠశాలల పట్ల ప్రభుత్వం కక్ష్య సాధింపు ధోరణితో వ్యవహరించడం లేదన్నారు. ఇటీవల రామానుజాపురం గ్రామం, వెంకటాపురం మండలం, భూపాలపల్లి జిల్లాలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి చూసి, గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడానికి సమిష్టిగా కృషి చేయాలని అభ్యర్థిస్తూ ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు గ్రామంలోకి వస్తే టైర్లలో గాలి తీయమనడం జరిగింది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన వ్యాఖ్య కాదు. ప్రైవేట్‌ పాఠశాలలపై వ్యతిరేకతతో చేసిన వ్యాఖ్య కాదు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు భయాపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలు సమర్థవంతంగా నడపడానికి విద్యాశాఖ మంత్రిగా తన పూర్తి సహకారం ఇస్తానని తెలియజేస్తున్నానని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివి. ఈ రెండు వ్యవస్థలను కాపాడుకుంటూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి విద్యా శాఖ మంత్రిగా నేను కృషి చేస్తున్నాను అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇదిలావుంటే ఎస్సీ గురుకులాల్లో ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్టు ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మైనార్టీ గురుకుల జూనియర్‌ కాలేజీలలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును 21 వరకు పొడిగించినట్టు టీఎంఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ బీ షఫీఉల్లా తెలిపారు.

Other News

Comments are closed.