ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్ల వెట్టి

share on facebook

ప్రైవేట్‌ యాజమాన్యలు చేస్తున్న వికృత చేష్టలు ఉపాధ్యాయ వృత్తికి మకిలి అంటిస్తున్నాయి. ప్రైవేట్‌ రంగంలో ఉపాధ్యావృత్తి వెట్టి చాకిరిగా మారింది. అసంఘటిత రంగంలో వెట్టి కార్మికులగా వారు బతుకు వెళ్లదీస్తున్నారు. వారికి వ్యక్తిగత జీవితం లేకుండా పాఠశాలలోనే గడిపేలా టీచర్లను బానిసలుగా చూస్తున్నారు. కేవలం అరకొరజీతాలతో, సెలవులు లేకుండా, సమయానికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న తీరు సర్కార్‌ కళ్లకు కనబడడం లేదు. ప్రభుత్వాలు, కార్మిక శాఖ కూడా చోద్యం చూస్తోందే తప్ప వారిని పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టం అమలు కావడం లేదు. కనీస పనిగంటలు అమలు కావడం లేదు. కనీస సెలవులు ఇవ్వరు. ప్రసూతి సెలవుల సంగతి సరేసరి. ఇక వేసవి సెలవులు కూడా ఉండవు. ఏదో బతుకీడ్చాలి కనుక..చదువుకున్న దానికి సార్థకత ఉండాలన్న తృప్తితో వారు పనిచేస్తున్నారు. అందుకే ప్రైవేటు టీచర్స్‌ చాలా మంది వాళ్ళకు వచ్చే జీతాలను ఎవరికీ చెప్పుకోరు.గురు సాక్షాత్‌ పరబ్రహ్మ అన్న సూక్తిని అనుసరించి ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నా కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రలేని జీవితంగా తయారయ్యింది వారి బతుకు. ప్రస్తుతం కొందరి ప్రవర్తన వల్ల అది కనుమరుగవుతోంది. న్యాయంగా వారికి రావలసిన జీతాలను ఎగ్గొడుతున్నారు. ఆర్థిక సంస్కరణల తరవాత ప్రైవేట్‌ రంగం విజృంభించడంతో ప్రైవేట్‌ స్కూళ్ల సంఖ్య పెరిగింది. విద్యాభివృద్దిలో ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లదే గణనీయమైన పాత్రగా చెప్పుకోవాలి. కానీ ఇంట్లో ఈగల మోత..బయట పల్లకి మోత అన్నచందంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయుల బతుకులు మారాయి. విద్యార్థులను తీర్చిదిద్ది ఐఐటిలుగా ఐఐఎంలు, కలెక్టర్లు, ఎస్పీలుగా తీర్చిదిద్దుదుతున్న ప్రైవేట్‌ టీచర్లు వెట్టికార్మికు లుగా జీవితాలను ఈడుస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే గడుపుతారు. ఇక్కడే వారి జీవితానికి పునాది పడుతుంది. వారి శ్రమిస్తేనే సమాజంలో ఉత్తమ పౌరులు పుడతారు. అలాంటి వారిని గౌరవంగా చూసు కోవాల్సిన యాజమాన్యాలు వెట్టికి గురిచస్తున్నాయి. ప్రైవేట్‌ టీచర్ల రక్తాన్ని.. శ్రమను దోపిడీ చేస్తున్నారు. వారి విలువైన సమయాన్ని… సంతోషాన్ని మింగేస్తున్నారు. వారికి కుటుంబ జీవితం లేకుండా జలగల్లా పీల్చేస్తున్నారు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.. భూమిని చూసి ఓర్పు నేర్చుకో.. చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో..ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో అన్నారు మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌. కాని ప్రైవేట్‌ టీచర్లు మాత్రం ఎలాంటి ఎదుగూబొదుగూ లేకుండా వెట్టి చాకిరీలో మగ్గు తున్నారు. సెలవుల్లో ఇంట్లో కుటుంబంతో గడిపే అవకాశం లేకుండా చేస్తున్నారు. పేరుమోసిన విద్యా సంస్థలు కూడా వెట్టి చేయించుకుంటున్నారు. ప్రైవేటు బడుల యజమానులకు వారంటే చులకన. టీచర్ల శ్రమశక్తిని దోచుకోవడం, సంపాదించుకోవడమే వారి విధిగా మారింది. స్కూల్స్‌ మధ్య పోటీ పెరిగింది. తమ స్కూలు మాత్రమే ఉత్తమ విద్యను అందిస్తుందని భారీ ప్రకటనలు ఇస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్న యాజమాన్యాలు టీచర్ల విషయంలో మాత్రం దాష్టీకాన్ని ప్రదర్శిస్తున్నాయి. బిచ్చం వేసినట్లు జీతాలు విసురుతారు. అదికూడా సమయానికి ఇవ్వరు. ఇలా ప్రైవేటు టీచర్స్‌ రక్తం పీలుస్తున్న జలగల్లా స్కూల్‌ యజమాన్యాలు తయారయ్యాయి. వీరిపై ఆజమాయిషీ లేక పోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు టీచర్ల జీవితాలు అటు వెట్టి చాకిరీకి నిదర్శనంగా మారాయి. ఎండాకాలం వచ్చిందంటే సర్కార్‌ టీచర్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటే వీరు మాత్రంగొడ్డు చాకిరీ చేయాల్సి వస్తోంది. ఎండల్లో ఇల్లిల్లూ తిరుగుతూ అడ్మిషన్లు తెచ్చే బాధ్యతా వీరిపైనే రుద్దుతారు. ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరీ చేసి అలసిపోతున్నారే తప్ప వారికి ఊరట దక్కడం లేదు. ఐదారు వేల జీతం చేసే వారు సైతం తమ బాధను  ఎవరికీ పంచుకోవడం లేదు. రోజువారీ జీతగాళ్ళుగా పనిచేసినా గిట్టుబాటు అవుతుంది. ఉపాధి హావిూ కూలీకి వెళ్లినా ఇంతని దక్కుతుంది. అయితే సంసారబాధ్యతలు పెరిగిన తరుణంలో వేన్నీళ్లకు చన్నీళ్లు అన్న ధోరణిలో చాలాంది టీచర్లుగా వెట్టిలో మగ్గుతున్నారు. స్కూల్‌ ఓనర్లకు భయపడుతూ… వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే చాలు ఏ అర్హతలు లేకున్నా టీచర్స్‌ గా వాళ్ళ స్కూల్‌ లో ఉండనిస్తారు. కార్మికులకు కార్మిక సంఘాలు.. రైతులకు రైతు సంఘాలు.. 100 రోజుల పనివాళ్ళకు సంఘాలు ఉన్నాయి కానీ.. ఏ సంఘం కూడా లేనివారు ప్రైవేటు టీచర్స్‌ అనడంలో సందేహం లేదు. పొరపాటున ఎవరైనా సంఘం కనుక పెడితే.. సంఘంలో సభ్యులుగా ఉంటే ఆ టీచర్స్‌కు ఉద్యోగమే లేకుండా చేస్తారు స్కూల్‌ యజమానులు. దాదాపుగా అన్ని ప్రవేటు స్కూళ్లలో నెలకు జీతం 3వేల నుంచి 9 వేలకు మించదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో కొన్ని కార్పోరేట్‌ స్కూళ్లలో ఇచ్చే జీతాలు చాలా అరుదు. ఎక్కడో ఏదో ఒక స్కూల్‌ లో 10 వేల నుండి 15వేల వరకు జీతాలు పొందినా ఆ స్కూల్స్‌ లో పనిచేసే వారి బాధలు నరకం కంటే అధ్వాన్నంగా ఉంటాయి. ఎక్కడైన నెలకు 30రోజుల జీతం ఉంటే ఈ ప్రైవేట్‌ స్కూల్స్‌ లో నెలకు ఒక సెలవు మాత్రమే ఇచ్చి ఒక్కటి ఎక్కువ సెలవు వాడుకున్నా… జీతం కట్‌.. ఆదివారాలు సెలవులు తీసేసి జీతం ఇస్తుంటారు. చాలా ప్రైవేటు బడులల్లో ఆదివారంకు ముందుగానీ.. తర్వాత గానీ సెలవు పెట్టుకుంటే 2రోజుల జీతం కట్‌ చేస్తారు. ఏదైన అనారోగ్యం గానీ ఇబ్బందులు గానీ వస్తే సెలవులు ఇవ్వరు… కొత్త వారిని పెట్టుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇవి ఉద్యోగాలని, వారిని టీచర్లని అనలేం. ఇదంతా పైకి కనిపిస్తున్న అందమైన వెట్టి చాకిరీ. పూర్వం గడీలల్లో పనిచేసిన బాంచెన్‌ జీతగాళ్లకన్నా అధ్వాన్నంగా వీరు బతుకులు ఈడుస్తున్నారు. ప్రభుత్వాలు నిజానిజాలను తేలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.నెల నెలా జీతాలు రాక ,ఇంటి అద్దెలు కట్టలేక,బిల్లులు కట్టలేక, అడ్వాన్స్‌ కోసం ఆఫీస్‌ రూంకి వెళితే రేపు మాపు అంటూ ,ఫీజులు రాలేదంటూతిప్పుకోవడం తెలుగు రాష్టాల్ల్రో లక్షల్లో ఉన్న వీరికి కనీస జీఆలు, కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.

 

Other News

Comments are closed.