ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్‌తో దాడి

share on facebook

విజయవాడ: బెజవాడలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై హత్యాయత్నం ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్‌ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో ఉన్న ఫైనాన్స్‌ కార్యాలయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దేవరపల్లి గగారిన్‌ అనే ఫైనాన్స్‌ వ్యాపారిపై ఇద్దరు దుండగులు ఆయన కార్యాలయంలోనే పెట్రోల్‌ పోసి నిప్పటించారు. ఈ ఘటనలో ఆయనకు 80శాతానికి పైగా గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆంధ్రా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. గగారిన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మూన్‌మూన్‌ ప్లాజా వద్ద గగారిన్‌ ఫైనాన్స్‌ కార్యాలయం ఉంది. అయితే, ఆయన ఈ రోజు కార్యాలయంలో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆయనపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. ఆయన శరీరానికి మంటలు అలముకోవడం, బయటకు పరుగెత్తుకొచ్చిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

పక్కా ప్రణాళికతోనే దుండగులు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు పెట్రోల్‌ క్యాన్‌తో పాటు కత్తిని కూడా తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పెట్రోల్‌ పోసిన తర్వాత కత్తిని అక్కడే వదిలి వెళ్లిపోయినట్టు సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో విభేదాల వల్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మద్దాల సుధాకర్‌, సురేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులకు గగారిన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో వారి ఆచూకీ తెలుసుకొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వ్యక్తులెవరెవరనే విషయాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన గగారిన్‌ తన వద్దకు ఎవరెవరు వచ్చారో పోలీసులకు చెప్పలేని పరిస్థితి ఉందని సమాచారం.

Other News

Comments are closed.